NTV Telugu Site icon

Red Card in Cricket: క్రికెట్‌లో తొలిసారి రెడ్‌ కార్డ్‌.. మొదటి బాధిత క్రికెటర్‌ ఎవరంటే?

Red Card In Cricket

Red Card In Cricket

Kieron Pollard sends off Sunil Narine in CPL 2023 with Red Card: ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, బాక్సింగ్.. లాంటి గేమ్‌లలో మనం తరచుగా ‘రెడ్‌ కార్డ్‌’ చూస్తుంటాం. రిఫరీ లేదా అంపైర్ ఓ ఆటగాడికి రెడ్‌ కార్డ్‌ చుపించాడంటే.. అతడు మైదానం వీడాల్సి ఉంటుంది. ఈ రెడ్‌ కార్డ్‌ను క్రికెట్‌లో మనం ఎప్పుడూ చుసుండం. తాజాగా క్రికెట్‌లో తొలిసారి రెడ్‌ కార్డ్‌ జారీ చేయబడింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్) 2023 ఎడిషన్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఆటగాడు సునీల్‌ నరైన్‌కు అంపైర్‌ రెడ్‌ కార్డ్‌ చూపించాడు. దీంతో రెడ్‌ కార్డ్‌ కారణంగా మైదానం వీడిన తొలి క్రికెటర్‌గా నరైన్ రికార్డుల్లో నిలిచాడు.

సీపీఎల్ 2023లో భాగంగా ఆగస్ట్‌ 27న సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మూడుసార్లు స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడింది. దాంతో జట్టులో ఎవరో ఒక ఆటగాడు మైదానం వీడాల్సి ఉంటుంది. అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్‌ నరైన్‌ పేరును ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ అంపైర్‌కు సూచించాడు. దాంతో నరైన్‌కు అంపైర్‌ రెడ్‌ కార్డ్‌ చూపించగా.. అతడు మైదానాన్ని వీడాడు. సీపీఎల్ 2023తోనే తొలిసారి క్రికెట్‌లో ఈ రెడ్‌ కార్డ్‌ రూల్‌ అమల్లోకి వచ్చింది.

ఫుట్‌బాల్‌లో ఓ ఆటగాడు ఫౌల్‌కు పాల్పడినప్పుడు రిఫరీ అతనికి రెడ్‌ కార్డ్‌ చూపించి.. మైదానాన్ని వీడాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేట్‌కు పెనాల్టీగా ఈ రెడ్‌ కార్డ్‌ను జారీ చేస్తారు. ఓ ఇన్నింగ్స్‌లో 3 సార్లు నిర్ధేశిత సమయంలో ఓవర్‌ను పూర్తి చేయకపోతే.. రెడ్‌ కార్డ్‌ను జారీ చేస్తారు. తొలిసారి ఓవర్‌ను పూర్తి చేయకపోతే ఓ ఫీల్డర్‌ను (ఐదో ఫీల్డర్‌), రెండోసారి మరో ఫీల్డర్‌ను (ఆరో ఫీల్డర్‌) 30 యార్డ్స్‌ సర్కిల్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది. మూడోసారి కూడా రిపీటైతే రెడ్‌ కార్డ్‌ ద్వారా జట్టులోకి ఓ ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది.

Also Read: Roger Binny: గతంలో కంటే వైజాగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి: బీసీసీఐ ప్రెసిడెంట్

17, 18, 19వ ఓవర్లను ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోయింది. దాంతో అంపైర్‌ రెడ్‌ కార్డ్‌ చూపించి జట్టులోని ఓ ఫీల్డర్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నైట్‌రైడర్స్‌ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌ 20 నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్‌ 17.1 ఓవర్లలో కేవలం​ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.