Jailer team agreed to alter the scene of a killer wearing RCB jersey: నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా ‘జైలర్’. ఈ చిత్రంకు మంచి టాక్ రావడం, రజనీకాంత్ నట విశ్వరూపం చూపించడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. జైలర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ పోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ సన్నివేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్‌సీబీ) జట్టు జెర్సీని ధరించిన ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌ను రజనీ చంపేస్తాడు. దీనిపై ఆర్‌సీబీ మేనేజ్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కోర్టు మెట్లెక్కింది. సదరు సన్నివేశంలో మార్పులు చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.
జైలర్ సినిమాలోని ఓ సన్నివేశంలో కాంట్రాక్ట్ కిల్లర్ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. హీరో రజనీకాంత్ అతడిని షూట్ చేస్తాడు. ఆ సమయంలో కాంట్రాక్ట్ కిల్లర్ ఆర్‌సీబీ జెర్సీలో ఉంటాడు. తమ అనుమతి లేకుండా ఆర్‌సీబీ జెర్సీని నెగెటివ్‌గా ఉపయోగించారని బెంగుళూరు టీమ్ మేనేజ్మెంట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై ఇటీవల విచారణ చేపట్టింది. కోర్టు బయటే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి.
సెప్టెంబర్ 1లోపు సినిమాలోని సదరు సన్నివేశంలో మార్పులు చేస్తామని జైలర్ చిత్ర యూనిట్ తాజాగా కోర్టుకు తెలిపింది. టెలివిజన్, ఓటీటీల్లోనూ మార్చిన సన్నివేశాన్ని జత చేస్తామని కూడా హామీ ఇచ్చింది. సెప్టెంబర్ 1 తర్వాత సినిమాలో ఆ సన్నివేశం ఉండకూడదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దాంతో ఈ వివాదంకు తెరపడింది. ఇక జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఒక్క తమిళనాడులోనే రూ. 175 కోట్లు వసూల్ చేసింది.