YCP Office Fire in Rayachoti: అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు వైసీపీ కార్యాలయం, అక్కడ ఉన్న వాహనాలకు టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు.
రాయచోటిలోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో సుమారు 10 వాహనాలకు నిప్పు పెట్టారు. ఆపై వైసీపీ కార్యాలయంకు నిప్పు పెట్టారు. మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. దాడి జరిగిన సమయంలో శ్రీకాంత్ రెడ్డి వైసీపీ కార్యాలయంలోనే ఉన్నారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దాడి నేపథ్యంలో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. దాడి భయంతో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు రావడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

