Site icon NTV Telugu

Maharashtra: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రవీంద్ర చవాన్ నామినేషన్.. అధికారిక ప్రకటన మరింత ఆలస్యం..?

Ravindra Chavan

Ravindra Chavan

Maharashtra: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర చవాన్ మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం వెల్లడించారు. ఈ విషయమై ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడిగా కిరణ్ రిజిజూ హాజరైనట్లు ఆయన వెల్లడించారు. రవీంద్ర చవాన్ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ బావంకులే లతోపాటు ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారని తెలిపారు.

Read Also:Anupama Parameshwaran : అనుపమ సినిమా.. సెన్సార్ బోర్డు ఆఫీస్ ముందు నిరసన..

ఇక సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రవీంద్ర చవాన్ రాజకీయ జీవితం యువజన విభాగం కార్యకర్తగా ప్రారంభమైందని.. ఆ తర్వాత కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రిగా ఎదిగారన్నారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడం మాకు గర్వకారణం అని అన్నారు. చంద్రశేఖర్ బావంకులే రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని ఫడ్నవీస్ ప్రశంసించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కృషి ఫలితాల రూపంలో కనిపించిందన్నారు.

థానే జిల్లాకి చెందిన ప్రముఖ నేత అయిన రవీంద్ర చవాన్ 2007లో కాల్యాన్-డోంబివ్లీ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో కాంగ్రెస్-ఎన్సీపీ అధికారంలో ఉన్నప్పటికీ.. స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌ గా ఎంపికయ్యారు. 2009లో డోంబివ్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తిరిగి విజయం సాధించి, ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్లపై రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. తర్వాత పల్గర్, రాయగడ్ జిల్లాలకు గార్డియన్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Read Also:Team India Schedule: ఇంగ్లండ్ పర్యటనలో మూడు భారత జట్లు.. జులై షెడ్యూల్ ఇదే!

2022లో ఏక్‌నాథ్ శిండే – ఫడ్నవీస్ సర్కార్ ఏర్పడడంలో ఆయన కీలకమైన వంతు పోషించారు. అదే ఏడాది PWD మంత్రిగా కేబినెట్‌లో చేరారు. 2024లో డోంబివ్లీ నుంచి నాలుగవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న రవీంద్ర చవాన్ నియామకంతో పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోవొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version