Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!

Rangasamy

Rangasamy

Rangasamy Oath: పుదుచ్చేరి రాజకీయాల్లో మరోసారి రంగస్వామి (Rangasamy) హవా కొనసాగింది. ఐదోసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశనాథన్ ఆయనతో పదవి, గోప్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నాబిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన రంగస్వామి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. పుదుచ్చేరిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తామని రంగస్వామి ప్రకటించారు. మౌలిక వసతులు, పర్యాటకం, సంక్షేమ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పని చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక నమస్సివాయం కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, కొత్త పథకాలను కూడా ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే మల్లాది కృష్ణరావు కూడా త్వరలో మంత్రివర్గంలో చేరనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా సహకారం అందిస్తోందని, దాంతో పర్యాటకం, సదుపాయాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.

మే 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆల్ ఇండియా N.R. కాంగ్రెస్ (ఎన్‌ఆర్ కాంగ్రెస్) 12 స్థానాలు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలు సాధించింది. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం ఒక స్థానంలో విజయం సాధించింది. ప్రతిపక్షంగా ఉన్న ద్రావిడ మున్నేట్ర కజగం ఐదు స్థానాలు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. తమిళనాడులో సంచలన ఎంట్రీ ఇచ్చిన తమిళగ వెట్టిరి కజగం (TVK) పుదుచ్చేరిలో కూడా రెండు స్థానాలు గెలుచుకుని ఖాతా తెరిచింది.