NTV Telugu Site icon

ATM Thief’s: 1 నుంచి 8వ తేదీ వరకు మోసాలు.. ఆపై సొంత వ్యాపారాలు, జల్సాలతో బిజీ బిజీ!

Atm Thief

Atm Thief

1 నుంచి 8వ తేదీ వరకు ప్రతి నెల మొదటి 8 రోజులు మోసాలకు పాల్పడి.. ఆ తరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8 రోజులే ఎందుకంటే.. ఆ తరువాత పెన్షనర్ల వద్ద డ్రా చేసేందుకు డబ్బులుండవన్నది వీరి ఉద్దేశం. ఈ ఇద్దరూ ఏటీఎంల వద్ద కాపు కాసి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన చల్లమూరు వెంకట భాస్కరరావు, పొన్నాడ కిరణ్ లను రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద నిఘా ఉంచి అరెస్టు చేశారు. వీరి నుంచి 2లక్షల 6వేల నగదు, 23 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాజమండ్రిలోని ప్రకాష్ నగర్, టూటౌన్, రాజానగరం, రావులపాలెం పోలీసుస్టేషన్ల పరిధిలో భాస్కరరావు, కిరణ్ కలిసి ఏటీఎం మోసాలకు పాల్పడ్డారు. వీరిని తొలిసారిగా రాజమండ్రి పోలీసులే అరెస్టు చేయడం విశేషం. గతంలో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూడా 15 మోసాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ ఇద్దరు నిందితులు ఏటీఎంల వద్ద మాటు వేసి, అమాయకులైన వ్యక్తులను టార్గెట్ చేస్తారు. నగదు డ్రా చేసుకునేందుకు సహాయం చేస్తున్నట్లు నటించి, కార్డు పనిచేయడం లేదని ఎంతో చాకచక్యంగా తమ వద్ద ఉన్న ఏటీఎంను ఇచ్చి కార్డును కాజేస్తారు. అప్పటికే పిన్ నెంబర్ తీసుకుని ఉండటంతో అమయాకులైన వీరి కార్డులను వినియోగించి నగదును డ్రా చేసుకుంటారు.

నెలలో 8 రోజుల పాటు మాత్రమే ఈ మోసాలకు పాల్పడే భాస్కర్, కిరణ్ లు మిగిలిన రోజుల్లో సొంత వ్యాపారాలు, జల్సాలు చేసుకుంటారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనం వల్లే వీరు ఈమోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటి మోసగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల వద్ద అపరిచితులను నమ్మవద్దని, అనుమానం వస్తే 112 నెంబర్ కు ఫోన్ చేయాలని రాజమండ్రి సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు.