NTV Telugu Site icon

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలే..

Rain Alert

Rain Alert

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుంది. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక, బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో వాతావరణం మళ్లీ మారిపోయింది. గత రాత్రి హైదరాబాద్ సహా మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయ్యాయి. ఎప్పట్లానే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇక, నాగర్ కర్నూలు, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, వికారాబాద్, కుమురంభీం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో స్పల్ప వర్షపాతం నమోదైంది. తెలంగాణలో నేడు కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడి, దాని ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Read Also: APSRTC: ఏపీలో మల్టీసిటీ జర్నీ రిజర్వేషన్‌.. ఒకే టికెట్‌పై రెండు బస్సుల్లో ప్రయాణం

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గురు­వారం కూడా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కాకుమాను మండలంలో 75, ప్రత్తిపాడులో 50.4, దుగ్గిరాలలో 41.2, వట్టిచెరుకూరులో 24.6, తెనాలిలో 23.8, మంగళగిరిలో 15, పెదకాకానిలో 13, చేబ్రోలులో 12.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను వానలు వీడలేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 60 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 46.6, ఇరగవరంలో 32.2, ఆచంటలో 20, పోడూరులో 19, పెంటపాడులో 17, తణుకులో 15 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ పలుచోట్ల వర్షాలు కొనసాగుతు­న్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లోనూ వర్షం కురిసింది.

Show comments