Telangana Rains: తెలంగాణకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం 27వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
ముఖ్యంగా నల్గొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల ప్రభావంతో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈరోజు నెల్లూరు, అన్నమయ్య, అల్లూరి సీతామరాజు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
