Mohammed Shami Rescues Person in Nainital: భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తనలోని మానవత్వంను మరోసారి చాటుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రజలకు సాయం చేసిన షమీ.. తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ పట్టణానికి సమీపంలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. తమ ముందు వెళ్తున్న ఓ కారు కింద పడిపోవడం గమనించిన షమీ.. వెంటనే తన కారు ఆపి అతడిని రక్షించాడు. కారు ప్రమాదానికి సంబందించిన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో భారత పేసర్ పంచుకున్నాడు.
రోడ్డు ప్రమాద బాధితుడి చాలా అదృష్టవంతుడని, దేవుడు అతడికి రెండు జీవితాలు ఇచ్చాడని మహమ్మద్ షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ‘ఇతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి రెండు జీవితాలు ఇచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్ రోడ్డుపై మా కారు ముందు వెళ్తున్న వాహనం కింద పడిపోయింది. అతడిని మేము సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం’ అని షమీ రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. షమీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో టీ20.. మ్యాచ్‌కు వర్షం ముప్పు!
వన్డే ప్రపంచకప్ 2023లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా మహమ్మద్ షమీ నిలిచాడు. షమీ 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడంతో తుది జట్టులోకి వచ్చిన షమీ.. తానేంటో నిరూపించాడు. ఆడిన తొలి మ్యాచ్ నుంచే ప్రధాన అస్త్రంగా మారిన షమీ.. ప్రత్యర్థులను వణికించాడు. ఓ మ్యాచులో ఏకంగా 7 వికెట్స్ తీశాడు. ఇక ఫైనల్లోనూ రెండు కీలక వికెట్లతో బ్రేక్ ఇచ్చినా.. మిగతా బౌలర్లు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాంతో భారత్ తృటిలో కప్ చేజార్చుకుంది. ప్రపంచకప్ 2023లోఆడిన షమీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.