బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో బారీ వరదలు సంభవిస్తున్నాయి. కాలనీల్లోని రోడ్లు ఏరులైపారుతున్నాయి. ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డిలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. హావేలిఘనపూర్ మండలంలో వర్షం వణికించింది. ధూప్ సింగ్ తండా, తిమ్మాయిపల్లి, నాగపూర్, వాడి గ్రామాలను వరద ముంచెత్తింది. ఇండ్లలో నీళ్లు చేరి గ్రామాల్లో రోడ్లపై నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది వరద. పిల్లికొట్టాల్ లో నీట మునిగిన సబ్ స్టేషన్.. మెదక్ జిల్లా కేంద్రానికి కరెంట్ సరఫరా నిలిపివేత.. మెదక్ జిల్లా కేంద్రాన్ని వాన ముంచెత్తింది. హవేలీ ఘనపూర్ (మం) నాగపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో నలుగురు ఉండొచ్చని స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:CP Radhakrishnan: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీపీ రాధాకృష్ణన్
కామారెడ్డి లో కుండ పోత వర్షం కురిసింది. పలు కాలనీలు నీట మునిగాయి. టెక్రియాల్ వద్ద డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు జల దిగ్బంధం లో చిక్కుకున్నాయి.. వాగులో చిక్కిన వారి కోసం.. హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరాడు ఎం.ఎల్. ఏ. మదన్ మోహన్ రావు. బిక్కనూరు మండలం తలమట్ల వద్ద రైలు పట్టాల పై నుంచి వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద నీటికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. పట్టాలు నీటిపై తేలియాడుతున్నాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు.. నిజమాబాద్ -సికింద్రాబాద్ రూట్ లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి – హైదరాబాద్ జాతీయ రహదారి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటం తో మూసివేశారు.
Also Read:Ganesh Chaturthi 2025: గణేష్ పండుగ భారత్ లోనే కాదు.. ఈ దేశాల్లో కూడా జరుపుకుంటారు తెలుసా?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య బర్లను మేపేందుకు వెళ్లి వాగులో గల్లంతయ్యాడు. మానేరు వాగులో గల్లంతయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ అలర్ట్ చేశారు. వెంటనే అక్కడ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కునేందుకు అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.
