NTV Telugu Site icon

Budget 2023: రైల్వే శాఖకు బడ్జెట్‌ బూస్ట్‌.. రికార్డు స్థాయిలో నిధులు కేటాయింపు

Railway

Railway

Union Budget 2023: కేంద్రం బడ్జెట్‌లో రైల్వే శాఖకు పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రైల్వేశాఖకు నిధులు కేటాయించారు. రైల్వేల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. కొత్త రైల్వేల నిర్మాణానికి పెద్దపీట పేస్తామని ప్రకటించారు. కేంద్ర సర్కారు దేశంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ఖర్చుపెట్టే మూలధన వ్యయాన్ని భారీగా పెంచుతూ ఇవాళ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూలధన వ్యయాన్ని ఏకంగా 33 శాతం పెంచుతూ నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టే మూలధన వ్యయం రూ.10లక్షల కోట్లకు పెరిగింది.

రైల్వేలో ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని పెంచాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రైల్వేలో 100 ముఖ్యమైన పథకాలను గుర్తించినట్లు వెల్లడించారు. రైల్వేలపై అత్యధికంగా ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 2013-2014 బడ్జెట్‌తో పోలిస్తే ఇప్పుడు కేటాయించిన మొత్తం తొమ్మిది రెట్లు ఎక్కువని తెలిపారు. నూతన కోచ్‌ల తయారీకి, వందేభారత్ రైళ్ల పెంపునకు పలు ప్రతిపాదనలు చేశారు. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రంగాల అభివృద్ధికి.., సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు వంద కీలకమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించినట్లు బడ్జెట్​ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి వెల్లడించారు. వీటిపై ప్రాధాన్య క్రమంలో రూ.75వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.15వేల కోట్ల ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండనున్నట్లు చెప్పారు.

Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక

రైళ్లలో ప్రజల ప్రయాణం మరింత పెరుగునున్నట్లు అంచనా వేసిన కేంద్రం.. మరో 1000కోచ్‌లను పునరుద్ధరించనున్నట్లు మంత్రి చెప్పారు. వీటిని రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు. ఈ కోచ్‌లను ప్రయాణికుల సౌకర్యంగా ఉండేటట్లు రూపొందించనున్నట్లు వెల్లడించారు.

Show comments