NTV Telugu Site icon

Rahul Gandhi: మోడీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: మోడీపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సవాల్ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు నేడు సూరత్‌ సెషన్స్‌ కోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణులను సంప్రదించి ఇప్పటికే ఆయన వ్యాజ్యం తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ అప్పీల్‌కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్‌కు వెళ్లనున్నారు. ఈ కేసులో తనని దోషిగా నిర్దారిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్‌ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువడే వరకు తనను దోషిగా తేల్చిన ట్రయల్‌ కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించనున్నట్లు సమాచారం. ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్‌ నేలతో కలిసి ఆయన సూరత్‌ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాహుల్ గాంధీ ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

Read Also: Farmer : అధికారుల ముందే ప్రాణాలను తీసుకున్న అన్నదాత

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన ఈ కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా నిర్దారించి.. రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. అధికారిక నివాసాన్నీ ఖాళీ చేయాలని ఆదేశించింది. తనపై జీవితకాలం అనర్హత వేటు వేసినా.. మోదీ-అదానీలపై సంబంధంపై క్లారిటీ వచ్చే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటానని రాహుల్ ఉద్ఘాటించారు. అదానీ షెల్‌ కంపెనీల్లోకి రూ.20వేల కోట్లు వచ్చాయని, ఆ డబ్బు ఆయనది కాదని, అది ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి భయపడే ఇప్పుడు నాపై అనర్హత వేటు వేశారని, శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసినా నేను భయపడేది లేదని, రూ.20వేల కోట్లు ఎవరివి అన్న ప్రశ్నకు జవాబు వచ్చేంతవరకూ నిలదీస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.