విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బీజేపీ-ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని ఆరోపించారు. ఎందుకంటే.. వారు ఆంగ్లం నేర్చుకుంటే ప్రశ్నించే తత్వం పెరుగుతుందని అది బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కి ఇష్టం లేదని విమర్శించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని.. విద్యార్థుల సాధికారతకు అది చిహ్నమన్నారు. ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థికి ఆంగ్ల భాష అవసరం ఎంతో ఉందని.. మాతృ భాషతో పాటు ఆంగ్లం తప్పకుండా నేర్పాలని సూచించారు.
READ MORE: Srisailam: శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకులు.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి..
“ఇంగ్లీష్ ఆనకట్ట కాదు. ఇది ఒక వంతెన. ఇంగ్లీష్ సిగ్గు చేటు కాదు. అది అధికారం. ఇంగ్లీష్ ఒక గొలుసు కాదు.. ఇది గొలుసులను విచ్ఛిన్నం చేసే సాధనం” అని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ పోస్టులో శీర్షిక పెట్టారు. అనంతరం పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. “బీజేపీ- ఆర్ఎస్ఎస్ లు భారతదేశంలోని పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే పేదలు ఈ భాష నేర్చుకుంటే.. వారికి ప్రశ్నించడం అలవాటు అవుతుంది. పేదలు ముందుకు సాగడం, సమానంగా నిలవాలని వాళ్లు కోరుకోరు. నేటి ప్రపంచంలో మీ మాతృ భాష ఎంత ముఖ్యమో.. ఇంగ్లీష్ అంతే ముఖ్యం. ఎందుకంటే ఇది ఉపాధిని అందిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భారతదేశంలోని ప్రతి భాషకూ ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉంటాయి. మనం వాటిని గౌరవించాలి. ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ నేర్పించాలి. ఇది మీ పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుంది.” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.