Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. రఫేల్ విమానాల ఒప్పందం వివాదం సమయంలో ప్రధానిపై “కమాండర్ ఇన్ చీఫ్”, “చోరో కే సర్దార్” అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన నేరపూరిత మాననష్టదావా విచారణను సుప్రీంకోర్టు మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఫిర్యాదుదారునికి నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో దిగువ కోర్టులో జరుగుతున్న విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ ముంబై హైకోర్టు సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
అసలేం జరిగింది?
2018 సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో రఫేల్ డీల్ వివాదంపై మాట్లాడే క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురిచేశాయని, ప్రధాని ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని బీజేపీ కార్యకర్త మహేష్ శ్రీశ్రీమాల్ ముంబై గిర్గామ్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, రాహుల్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా, న్యూస్ ఛానళ్లలో ప్రధానిపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగిందని, ఇది కచ్చితంగా మాననష్టదావా కిందకే వస్తుందని ఆయన వాదించారు. ప్రధానిని “చోరో కే సర్దార్” అని అనడం ద్వారా బీజేపీ నాయకులందరినీ దొంగలుగా చిత్రీకరించారని, దీనివల్ల పార్టీకి, కార్యకర్తల గౌరవానికి తీవ్ర భంగం వాటిల్లిందని శ్రీశ్రీమాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది?
బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేట్ కోర్టు, 2019 ఆగస్టులో రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు 2021 జులైలో రాహుల్‌కు అందాయి. దాంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రసంగంలో ఎక్కడా ప్రత్యేకంగా బీజేపీ పేరు తీయలేదని, నిర్దిష్టమైన లేదా స్పష్టమైన వ్యక్తుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రాహుల్ తరఫు న్యాయవాదులు వాదించారు. చట్ట ప్రకారం ఒక స్పష్టమైన సమూహం లేదా వ్యక్తి లేనప్పుడు, ఈ ఫిర్యాదుకు చట్టబద్ధత ఉండదని, అందువల్ల కేసును కొట్టివేయాలని కోరారు. అయితే, గతంలో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కేసులో ఇచ్చిన తీర్పును ముంబై హైకోర్టు ఇక్కడ ప్రస్తావించింది. రిజిస్టర్ అయిన ఒక రాజకీయ పార్టీ అనేది చట్టబద్ధంగా ఒక స్పష్టమైన సమూహం కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు, సెప్టెంబర్ 8న రాహుల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం దిగువ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

