Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రాజకీయాల్లో ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫొటోలు, వీడియోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లడం, ఆయన ముక్కు నుంచి రక్తం కారుతుండటం, దుస్తులు నలిగిపోయి, ఒక షూ కూడా ఊడిపోయిన స్థితిలో నిర్బంధంలోకి తీసుకోవడం మీడియాలో తీవ్ర కలకలం రేపింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన భారీ ఆందోళనలతో పేపర్ లీక్ అంశంపై ప్రధాన ప్రతిపక్ష స్థానం చేజారిపోతుందన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ తన పట్టును నిలబెట్టుకోవడానికి ఈ పరిణామాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ప్రధాని నివాసం వద్ద నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం మోదీ ప్రభుత్వానికి ఒక రాజకీయ ‘సెల్ఫ్ గోల్’ ఓ సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో చర్చకు అనుమతించడం లేదా శాంతియుత నిరసనకు అవకాశం ఇవ్వడానికి బదులుగా, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకుంటున్నారనే బలమైన సందేశాన్ని కాంగ్రెస్‌కు బీజేపీ ప్రభుత్వమే చేతులారా అందించినట్లయిందని విశ్లేషించారు.

నిజానికి ప్రధానమంత్రి నివాసం వద్ద ప్రతిపక్ష నాయకుడు ఇలా నిరసన తెలపడం ఓ అనూహ్యమైన పరిణామం. గతంలో 1999లో ఐసి-814 (IC-814) విమానం హైజాక్ అయిన సమయంలో బాధితుల కుటుంబాలు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇంటి ముందు ధర్నా చేశాయి. ఆ తర్వాత మళ్లీ ప్రధాని నివాసం వద్ద ఇంతటి ఆందోళన జరగడం ఇదే తొలిసారి. ప్రధాని ఇల్లు ఉండే అత్యంత భద్రతా ప్రాంతంలో రాహుల్ ప్రొటెస్ట్ చేయడం సరైనదా కాదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం పరీక్షల లీకేజీలపై చర్చకు సిద్ధంగా లేనందునే విద్యార్థుల ఆవేదనను దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. మరోవైపు భద్రతా కారణాల రీత్యానే చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంది.

ఈ క్రమంలో రోడ్డుపై పడుకుని ఉన్న రాహుల్‌ను పోలీసులు నెట్టివేస్తుండటం, ముక్కు నుంచి రక్తం కారుతున్నా ఆయనను కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా పోలీస్ బస్సులోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. “భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది” అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక, జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్ కొంత దూరంగానే ఉంది. ఈ పార్టీ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఉందనే ప్రచారంతో మొదట్లో కాంగ్రెస్ అప్రమత్తంగా వ్యవహరించింది. ఇటీవల కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, గత మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసినప్పటికీ, రాహుల్ గాంధీ మాత్రం సీజేపీ వేదికలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో రాహుల్ విదేశీ పర్యటనతో కాంగ్రెస్ చేపట్టిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమం కాస్త మందగించగా, సీజేపీ ఉద్యమం బాగా ఊపందుకుంది. ఇటీవల డెహ్రాడూన్ కార్యక్రమంలో కేంద్ర విఫలత్వాన్ని రాహుల్ ప్రశ్నించినప్పటికీ, ఉద్యమాన్ని నడిపిస్తోందనే పేరు సీజేపీకే దక్కుతోంది.

ఈ నేపథ్యంలో ప్రధాని నివాసం వద్దకే నేరుగా నిరసనను తీసుకెళ్లడం ద్వారా రాహుల్ గాంధీ ఒకే దెబ్బకు పలు లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేశారు. పేపర్ లీక్‌లపై పోరాటంలో సీజేపీ ముందంజలో ఉందనే భావనను చెరిపివేసి, తానే ఉద్యమానికి ప్రధాన ముఖచిత్రంగా మారడం ఒకటైతే.. విద్యాశాఖ మంత్రి పరిధి నుంచి ఈ సమస్యను నేరుగా ప్రధాని మోదీ పరిధికి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచడం మరొకటి. రాహుల్ గాంధీ మంగళవారం నాటి నిరసనలో గీత దాటారా లేదా అనే చర్చ ఎలా ఉన్నప్పటికీ, ప్రధాని నివాసం వెలుపల రక్తం కారుతున్న ముఖంతో పోలీసులు ఈడ్చుకెళ్లిన ఆ ప్రతిపక్ష నాయకుని చిత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రాజకీయ మైలేజీని తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు.