Rahul Gandhi Hyderabad Visit: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ?.. భారత్ సమ్మిట్‌, గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం!

Rahul Gandhi Hyderabad Visit

Rahul Gandhi Hyderabad Visit

Rahul Gandhi Hyderabad Visit: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం ముగిసింది. దాదాపు అరగంట పాటు భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, బీసీలకు ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చించినట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలపై రాహుల్ గాంధీకి నివేదిక అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పీసీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను వివరించామన్నారు. ముఖ్యంగా ఓబీసీల సమస్యలు, వారికి రాజకీయంగా కల్పించాల్సిన ప్రాతినిధ్యంపై చర్చ జరిగినట్లు మహేశ్ గౌడ్ చెప్పారు.

భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నవంబర్ 13 లేదా 14 తేదీల్లో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు. అయితే పర్యటన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. భారత్ సమ్మిట్‌తో పాటు హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ సూచించినట్లు వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం గిగ్ యాక్ట్ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ వారితో సమావేశమై మాట్లాడనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

హైదరాబాద్‌లో సర్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న సభతో పాటు మెగా బీసీ ర్యాలీకి కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు మహేశ్ గౌడ్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, వివాదాలపై రాహుల్ గాంధీతో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలను పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటారని తెలిపారు. నవంబర్ నెలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. మరోవైపు సోనియా గాంధీ ఆత్మకథను స్వాగతిస్తున్నామని, తెలంగాణలో ఆ పుస్తకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు చెప్పారు.