Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ, నొప్పి తనకు తెలుసని లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. మీరు ఎలా ఉన్నారంటూ గిగ్ వర్కర్లను కాంగ్రెస్ అగ్రనేత పలకరించారు. గిగ్ వర్కర్ల కష్టం గుర్తించే తాను, తమ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తామని నాడు హామీ ఇచ్చాం, వాగ్దానం చేశామన్నారు. తాము ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పుకొచ్చారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన డేటా ఇప్పటి వరకు భారతదేశంలో లేదన్నారు. డెలివరీకి సంబంధించి ఎంత సమయం పడుతుంది.. ఎంత ఇస్తారనే సమాచారం కూడ లేదని.. కష్టం మీది కానీ మీ సమాచారం మీ దగ్గర లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మీ కోసం పని చేస్తోందని.. ప్రతి డెలివరీపై మీకు వచ్చే దానిని మీకు తెలియజేస్తోందని వివరించారు. తెలంగాణలో నగరాల్లోని ఎండల్లో మీరు మోటార్ సైకిళ్లపై వెళుతుంటారని. మీకు విశ్రాంతి కోసం ఎటువంటి రెస్ట్ హౌజ్‌లు లేవని.. ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేందుకు హైదరాబాద్‌లో, తెలంగాణలోని ఇతర నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెస్ట్ హౌజ్‌లు నిర్మించిందన్నారు.
గిగ్ వర్కర్లకు అనారోగ్యం వచ్చినప్పుడు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ. పది లక్షల ప్రమాద బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. “గిగ్ వర్కర్లకు పింఛను, ఇతర సౌకర్యాలు అందుతాయి.. ప్రతి డెలివరి, ప్రతి రవాణాకు సంబంధించిన 1 శాతం మీ గిగ్ వర్కర్ల ఖాతాలో చేరుతుంది. ఆ డబ్బు గిగ్ వర్కర్ల బోర్డుకు చేరుతుంది. అక్కడి నుంచి మీ ఖాతాకు చేరుతుంది. దేశంలో రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి.. మొదటిది ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానం.. అది కట్టు బానిసత్వాన్ని కోరుతుంది.. 24 గంటలు పని చేయాలి. శ్రమను దోచుకునేవి.. మీ శ్రమను అదానీకి, అంబానీకి దోచిపెట్టేవి. రెండవది గిగ్ వర్కర్.. దేశానికి పునాది, దేశ భాగస్వామి అని కాంగ్రెస్ ఆలోచన విధానం. గిగ్ వర్కర్‌కు రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచన.. మీకు ప్రతి డెలివరిలో వాటా రావాలని, మీకు రెస్ట్ దొరకాలని కాంగ్రెస్ భావిస్తోంది.. నరేంద్ర మోడీ ఆలోచన విధానం.. మీకు ఏం దక్కవద్దంటోంది.. రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలకు చదువు, మీ ఆరోగ్యానికి అండగా ఉంటుంది.. మీరు భయపడవద్దు.. మీకు మేం అండగా ఉంటాం..” అని భరోసా ఇచ్చారు. జై హింద్.. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

