Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు

  • భారత్ సమ్మిట్‌లో విదేశీ ప్రతినిధుల అంశాన్ని ప్రస్తావించిన రాహుల్
  • అన్నీ తమకే తెలుసనుకునే వారే ఫాసిస్టులు.. రాహుల్ వ్యాఖ్యలు
  • మోడీ, అదానీల కలయికతో వ్యాపార, రాజకీయ సంబంధాలపై విమర్శలు
  • ద్వేషంతో కాదు.. ప్రేమ, అహింసతోనే పోరాటం చేస్తాం
Rahul Gandhi

Rahul Gandhi

హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ ముగింపు సభలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ఫాసిస్టు శక్తులపై ప్రేమ, అహింస అనే ఆయుధాలతోనే తాము పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రతినిధులను కేంద్రం అడ్డుకుంది.. క్షమాపణలు చెప్పిన రాహుల్

సదస్సు ప్రారంభంలోనే రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాల్సిన పలువురు విదేశీ నాయకులు, ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ఆరోపించారు. కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడం వల్లే వారిని రప్పించలేకపోయామని చెబుతూ.. సదస్సుకు రాలేకపోయిన ప్రతినిధులందరికీ ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.

అన్నీ తమకే తెలుసనుకునే వారే ఫాసిస్టులు

ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారని రాహుల్ గాంధీ విశ్లేషించారు. అందరి మాట వింటూ నేర్చుకునే వారు కొందరైతే, అన్నీ తమకే తెలుసని, తామే దేవుళ్లమని భావించే వారు మరికొందరు ఉంటారని అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి ఉన్నవారినే ‘ఫాసిస్టులు’ అంటారని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవస్థలు కుప్పకూలినప్పుడే ఫాసిస్టులు బయటకు వస్తారని, వారు కేవలం గట్టిగా అరుస్తారే తప్ప ఇతరుల మాట వినరని విమర్శించారు. మెజారిటీ ప్రజలు వినయంతో ఉండి ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారని, గత దశాబ్ద కాలంగా దేశంలో ఫాసిస్టుల ఆగడాలు పెరిగిపోయాయని, ప్రస్తుతం దేశంలో ఈ రెండు వర్గాల మధ్యే అసలైన పోరాటం జరుగుతోందని రాహుల్ పేర్కొన్నారు.

మోడీ, అదానీల కలయికపై ఆరోపణలు

దేశ ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్ విధానాలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రపంచ కుబేరుల జాబితాలో 600వ స్థానంలో ఉన్న ఒక వ్యాపారవేత్త, ఏడు నెలల క్రితం ఏకంగా 2వ స్థానానికి చేరుకున్నారని పరోక్షంగా అదానీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ, అదానీల కలయిక వల్ల రాజకీయాలకు, వ్యాపారానికి మధ్య ఉన్న గీత చెరిగిపోయిందని ఆరోపించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బ్రిడ్జిలు, సిమెంట్, డిఫెన్స్.. ఇలా ఏ రంగం చూసినా అదానీ ఆస్తులే కనిపిస్తున్నాయని విమర్శించారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ఆస్తులు 11 రెట్లు పెరిగాయని, ఎవరూ పోటీ పడలేని ఆర్థిక శక్తిగా ఆ పార్టీ మారిందని అన్నారు. మీడియా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, బహిరంగ సభలన్నీ మోడీ గుప్పిట్లోకి వెళ్లిపోయాయని, టీవీలు, సోషల్ మీడియాలో 24 గంటలూ మోడీ, బీజేపీనే చూపిస్తూ ప్రతిపక్షాలకు కనీస మద్దతు లేకుండా చేశారని మండిపడ్డారు.

ద్వేషంతో కాదు.. ప్రేమతోనే ఓడిస్తాం

తమ పోరాట పంథాను వివరిస్తూ.. ద్వేషం, హింసతో ఫాసిస్టు శక్తులను ఎదుర్కోలేమని, అవి తమ సిద్ధాంతాలు కావని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కోపం, ద్వేషం లేకుండా కేవలం ప్రేమ, ఆప్యాయతతోనే వారిని ఎదుర్కొంటామని చెప్పారు. సత్యం, అహింస, ప్రేమ చేతిలోనే వారు ఓడిపోయే రోజు కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమలాగే ఆలోచిస్తూ ఒకే తరహా ఆర్థిక వ్యవస్థ, ద్వేషపూరిత శక్తులపై పోరాటం చేస్తున్న మిత్రులందరికీ ఆయన స్వాగతం పలికారు. తాము ఎవరినీ ద్వేషించమని, కించపరచమని చెబుతూనే.. దేశంలోని ప్రతి మూల నుంచీ ఫాసిస్టు శక్తులను తరిమికొట్టడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.