Ragiri Satyanarayana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) రాగిరి సత్యనారాయణ గౌడ్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆయన్ను జడ్జి నివాసంలో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈ నెల 27 వరకు పద్నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు సత్యనారాయణను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం హైదరాబాద్‌తో పాటు మొత్తం పది ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ. 7 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 70 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. సోదాల సందర్భంగా సత్యనారాయణ నివాసంలో 50 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కార్లు, ఒక ట్రాక్టర్‌తో పాటు ఎల్ఐసీ బాండ్లకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్థిరాస్తుల విషయానికొస్తే, తుక్కుగూడలో ఒక ఖరీదైన విల్లా, వనపర్తిలో 25 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఐదు ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా, సత్యనారాయణ సోదరుడి ఇల్లు, ఫామ్హౌస్లలోనూ తనిఖీలు చేపట్టడంతో పాటు, ఆయన తండ్రి మన్యంగౌడ్ పేరుపై ఉన్న ఆస్తుల వివరాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. 2005లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఇరిగేషన్ శాఖలో ఉద్యోగంలో చేరిన సత్యనారాయణ, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనుల్లో కీలక పాత్ర పోషించారు. ఆయనపై 2024లోనే ఆదాయానికి మించిన ఆస్తుల విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఇటీవల ఏసీబీ 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు కూడా వరుస ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా సత్యనారాయణ కదలికలపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు, పక్కా ఆధారాలతో దాడులు నిర్వహించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

