Ragi Daliya Recipe: బరువు తగ్గాలనుకునే వారికి, బీపీ, షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేసే ఆరోగ్యకరమైన వంటకం. దీనిని తయారు చేయడం సులభం. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ హెల్తి ఎలా చేయాలో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి: 3 టేబుల్ స్పూన్లు.
* వేరుశనగ పప్పు: 3 టేబుల్ స్పూన్లు.
* ముడి కందులు: 3 టేబుల్ స్పూన్లు.
* సామ/కొర్ర బియ్యం (Little Millet): 3 టేబుల్ స్పూన్లు (2 గంటల పాటు నానబెట్టినవి)
* నీరు: 300 ml
* జీలకర్ర: 1.5 టీస్పూన్ (1 టీస్పూన్ వేయించడానికి, 0.5 టీస్పూన్ ఉడకబెట్టడానికి)
* ధనియాలు: 1 టీస్పూన్
* కరివేపాకు: 1 రెమ్మ
* వెల్లుల్లి రెబ్బలు: 4-5
* పచ్చిమిర్చి: 1 (తరిగినది)
* తోటకూర: 1 కట్ట (తరిగినది)
* నెయ్యి: 2 టీస్పూన్లు
* నిమ్మరసం: అర చెక్క
* సైంధవ లవణం: రుచికి సరిపడా
* పెరుగు: 1 కప్పు (పెరుగు పచ్చడి కోసం)
* ఉల్లిపాయ: 1 (తరిగినది)
* వేయించిన జీలకర్ర పొడి: పావు టీస్పూన్
తయారీ విధానం:
మొదటగా 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిలో తగినన్ని నీళ్లు పోసి, ఉండలు లేకుండా జోరుగా కలుపుకుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మరోవైపు ఒక పాన్‌లో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును లో ఫ్లేమ్ మీద వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో 3 టేబుల్ స్పూన్ల ముడి కందులను సన్నని మంట మీద వేయించి అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 రెమ్మ కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి.
ఇక ఆ పొడిని పక్కన పెట్టుకొని.. ఒక మందపాటి గిన్నెలో 300ml నీటిని పోసి మరిగించాలి. నీళ్లు మరిగాక అందులో అర టీస్పూన్ జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న సామ లేదా కొర్రలు బియ్యాన్ని వేసి కలపాలి. దీనికి తరిగిన పచ్చిమిర్చి, తోటకూరను కూడా కలిపి మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సామలు లేదా కొర్రలు ఉడికాక.. ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని పోసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక తయారు చేసుకున్న వేరుశనగ, కంది పొడిని వేసి బాగా కలపాలి. ఈ పొడి వేయడం వల్ల వంటకానికి మంచి రుచి, వాసన వస్తుంది. చివరగా రుచికి సరిపడా సైంధవ లవణం వేసి, మూత పెట్టి మరో 3-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. వంటకం మెత్తగా ఉడికిన తర్వాత 2 టీస్పూన్ల నెయ్యి, ఓ నిమ్మకాయ నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకుని దించేయాలి. అంతే హెల్తీ ‘రాగి ధలియా’ రెడీ.
ఈ రాగి ధలియాలోకి పెరుగు పచ్చడి అద్భుతమైన కాంబినేషన్. ఇందు కోసం ఒక కప్పు పెరుగును తీసుకొని అందులో పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా సైంధవ లవణం, తరిగిన ఉల్లిపాయలను వేసి కలుపుకుంటే పెరుగు పచ్చడి సిద్ధం. అంతే రాగి ధలియాలోకి బెస్ట్ కాంబినేషన్ రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు:
‘రాగి ధలియా’ శరీరానికి చాలా తేలికగా అనిపిస్తుంది. తిన్న తర్వాత నిద్ర రావడం లేదా మత్తుగా అనిపించడం వంటివి ఉండవు. వారంలో కనీసం రెండు మూడు సార్లు దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
