Radikaa Sarathkumar About Secret Cameras: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఇచ్చిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలిపారు. ఈ క్రమంలో సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. నటీమణుల కారవాన్‌లలో కొందరు సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని రాధిక పేర్కొన్నారు.
ఓ జాతీయ మీడియాతో రాధిక శరత్‌కుమార్ మాట్లాడుతూ… ’46 ఏళ్ల నుంచి నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నా. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్నిచోట్లా ఇదేవిధమైన సమస్యలు మహిళలకు ఎదురవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఒక సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లాను. నా షాట్ ముగించుకుని వెళ్తుండగా సెట్‌లో కొంతమంది మగవారు ఒకదగ్గర కూర్చొని ఫోన్‌లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. వారు ఏదో వీడియో చూస్తున్నారని నాకు అర్థమైంది. నేను సిబ్బందిని పిలిచి.. వారు ఏం చూస్తున్నారని అడిగాను. కారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఫోన్‌లో చూస్తున్నారని చెప్పాడు. మీరు ఆర్టిస్ట్ పేరును టైప్ చేస్తే వీడియో వస్తుందని చెప్పాడు’ అని తెలిపారు.
Also Read: Novak Djokovic: యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం.. జకోవిచ్ ఔట్! 18 ఏళ్లలో ఇదే మొదటిసారి
‘మనం పైకి చూస్తూ ఉమ్మి వేస్తే.. అది మన ముఖం మీదే పడుతుంది. కాబట్టి నేను వారి పేర్లు చెప్పాలనుకోవడం లేదు. సీక్రెట్ కెమెరాల గురించి చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. కారవాన్‌లో కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెబుతానని టీమ్‌కు వార్నింగ్ ఇచ్చా. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇతర నటీమణులకు రహస్య కెమెరాల గురించి చెప్పి జాగ్రత్తగా ఉండండని సూచించా. ఆ ఘటన తర్వాత నాకు కారవాన్ ఉపయోగించాలంటే భయం వేసేది. దుస్తులు మార్చుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, భోజనం చేయడానికి.. ఇలా వ్యక్తిగత పనులకు షూటింగ్ సెట్‌లో అదే మా ప్రైవేట్ ప్లేస్. అక్కడ కూడా మాకు ప్రైవసీ ఉండదు’ అని రాధిక అసహనం వ్యక్తం చేశారు.