బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించిన రాధికా ఆప్టే, అనతి కాలంలోనే విభిన్నమైన పాత్రలతో, కంటెంట్ ఆధారిత సినిమాలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఒకవైపు సినిమాల్లో చిన్నపాత్రలతో మొదలుపెట్టి, మరోవైపు గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో వరుస ప్రాజెక్టులు దక్కించుకుని, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్న కొద్దిమంది నటీమణుల్లో రాధికా ముందువరుసలో నిలిచారు.
Also Read : Navya Nair : ఓనం వేడుకలకు వెళ్లి.. రూ.1.14 లక్షల జరిమానా ఎదుర్కొన్న మలయాళ నటి
2005లో షాహిద్ కపూర్ నటించిన “వాహ్! లైఫ్ హో తో ఐసీ!” సినిమాతో రాధికా ఆప్టే తన కెరీర్ ఆరంభించారు. ఆ పాత్ర చిన్నదైనా, తాను నటిగా ప్రత్యేకమని అప్పటికే చూపించారు. తర్వాత 2009లో బెంగాళీ భాషలో వచ్చిన “అంతహీన్” సినిమాలో హీరోయిన్‌గా కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అప్పటి నుంచి కమర్షియల్ ఫార్ములా సినిమాలకన్నా విభిన్నమైన, సవాళ్లు ఉన్న కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళం, బెంగాలీ సినిమాల్లోనూ నటించి బహుభాషా నటి అనే పేరు తెచ్చుకున్నారు. అయితే 2018లో రాధికా నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా మూడు ప్రాజెక్టుల్లో నటించారు “లస్ట్ స్టోరీస్”, “సేక్రెడ్ గేమ్స్”, “ఘోల్”. ఈ ప్రాజెక్టులు ఆమెకు “OTT క్వీన్” అనే బిరుదు తెచ్చిపెట్టాయి. లస్ట్ స్టోరీస్ లో ఆమె చేసిన నటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ కారణంగా ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ నామినేషన్ దక్కించుకుని, ఆ గౌరవం పొందిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు.
అలా భారతీయ సినిమాలతోనే ఆగకుండా, హాలీవుడ్ ప్రాజెక్ట్ “ఎ కాల్ టు స్పై” (2019)లో నూర్ ఇనాయత్ ఖాన్ పాత్రలో రాధిక నటించారు. ఈ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత “రాత్ అకేలీ హై” (2020), “మోనికా, ఓ మై డార్లింగ్” (2022) వంటి ప్రాజెక్టులు ఆమె కెరీర్‌కు మరింత బలంగా మారాయి . ఇక ఇటీవల విడుదలైన “సిస్టర్ మిడ్‌నైట్” (2025) సినిమాలో రాధికా అద్భుతమైన నటనతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ పాత్రతో బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నామినేషన్ పొందారు. ఇది ఆమె ప్రతిభకు మరో నిదర్శనం.