Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ రాజ కుటుంబం విలాసవంతమైన బోయింగ్ 747-8 జెట్‌ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విమానం విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు(దాదాపు 3,300 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ విమానం తాత్కాలికంగా ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగించబడే అవకాశం ఉంది. 2029లో ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసిన తర్వాత, ఈ విమానం ట్రంప్ అధ్యక్ష గ్రంథాలయ ఫౌండేషన్‌కు బహుమతిగా ఇవ్వబడనుంది. ఇక ఈ బహుమతి విషయాన్ని ధృవీకరించలేదు. అయితే ఈ నిర్ణయం అమెరికా రాజకీయ, నైతికత పరంగా తీవ్ర విమర్శలకు గురైంది. డెమొక్రటిక్ పార్టీ సభ్యులు, నైతిక నిపుణులు ఈ బహుమతిని అమెరికా రాజ్యాంగంలోని ఎమోలుమెంట్స్ క్లాజ్‌ను ఉల్లంఘించడంగా అభివర్ణిస్తున్నారు. ఈ క్లాజ్ ప్రకారం, విదేశీ ప్రభుత్వాల నుండి గిఫ్టులు స్వీకరించడానికి అనుమతి అవసరం.
Read Also: Airports: ప్రయాణికులకు అలర్ట్.. 32 విమానాశ్రయాలు రీఓపెన్
అయితే, ట్రంప్ న్యాయ బృందం ఈ బహుమతిని చట్టబద్ధంగా సమర్థించేందుకు ప్రయత్నిస్తోంది. విమానాన్ని ప్రత్యక్షంగా ట్రంప్‌కు కాకుండా.. అమెరికా ప్రభుత్వానికి, ట్రంప్ గ్రంథాలయ ఫౌండేషన్‌కు బహుమతిగా ఇవ్వడం వల్ల ఇది చట్టబద్ధమని వారు పేర్కొంటున్నారు. కాకపోతే, విమర్శకులు ఈ బహుమతిని ట్రంప్, ఖతార్ మధ్య ఉన్న వ్యాపార సంబంధాల నేపథ్యంలో పరిశీలిస్తున్నారు. ట్రంప్ సంస్థ ఖతార్‌లో 5.5 బిలియన్ డాలర్ల విలువైన గోల్ఫ్ కోర్సు ప్రాజెక్టును ప్రారంభించడంతో, ఈ బహుమతి వ్యాపార ప్రయోజనాల కోసం ఇస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు.
Read Also: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
ఈ వివాదం ట్రంప్ మిడిల్ ఈస్ట్ పర్యటనకు ముందు వెలుగులోకి రావడం గమనార్హం. ట్రంప్ ఖతార్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను సందర్శించనున్నారు. ఈ బహుమతి చట్టబద్ధతపై అమెరికా ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమీక్ష నిర్వహిస్తున్నాయి. ఖతార్ ప్రభుత్వం ఈ బహుమతి విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ వివాదం ట్రంప్, విదేశీ ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలపై మరింత దృష్టి సారించడానికి కారణమవుతోంది.
