Site icon NTV Telugu

PVN Madhav: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు.. కీలక అంశాలపై చర్చ!

Pvn Madhav, Pawan Kalyan

Pvn Madhav, Pawan Kalyan

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్ కలిశారు. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మర్యాదపూర్వకంగా డిప్యూటీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మాధవ్‌కు పవన్ శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఈ భేటీలో ఇద్దరు పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించారు. కూటమి కార్యాచరణ, ప్రభుత్వంలో భాగస్వామ్యం, రాజకీయ సమన్వయంపై నేతలు చర్చించారు. జనసేన–బీజేపీ మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంచే దిశగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: AP Cabinet: మంత్రులు ఇక రోజులు లెక్కపెట్టుకోండి.. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి మాధవ్‌ ఒక్కరే నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. మాధవ్‌కు బీజేపీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. మొన్నటివరకు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ సీనియర్‌ నేత, దివంగత చలపతిరావు కుమారుడు మాధవ్‌ అన్న విషయం తెలిసిందే.

Exit mobile version