Russian fighter jet crash: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పెద్ద దెబ్బ తగిలింది. రష్యా అత్యాధునిక Su-30SM ఫైటర్ జెట్ నల్ల సముద్రం సమీపంలో అదృశ్యమైందని ఉక్రెయిన్ నేవీ పేర్కొంది. ఈ జెట్ ధర దాదాపు 50 మిలియన్ డాలర్లు (సుమారు ₹ 415 కోట్లు) ఉంటుందని చెబుతున్నారు. ఇది మాత్రమే కాకుండా రష్యాలోని రియాజాన్ ప్రాంతంలోని ఒక మందుగుండు సామగ్రి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలు అలాస్కా పర్యాటనకు ముందు పుతిన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ MORE: Students Protest: హాస్టల్లో నాసిరకం భోజనంపై ఆందోళన.. విద్యార్థులను బెదిరించిన యాజమాన్యం!
జాడలేని ఇద్దరు ఫైలట్స్..
ఉక్రెయిన్ నేవీ ప్రకారం.. గురువారం స్నేక్ ఐలాండ్ (జ్మియిని ద్వీపం)కి ఆగ్నేయంగా ఒక మిషన్ కారణంగా రష్యాకు చెందిన Su-30SM ఫైటర్ జెట్ కూలిపోయింది. ఇది ట్విన్-ఇంజన్, రెండు సీట్ల మల్టీరోల్ ఫైటర్. ఈ ఫైటర్ జెట్ గాలిలో శత్రువుపై ఆధిపత్యం చెలాయించడానికి అలాగే భూమిపై దాడులకు వినియోగిస్తున్నారు. ఉక్రేనియన్ నిఘా సంస్థలు రష్యన్ రేడియో సమాచార ప్రసారాలను అడ్డగించడంతో జెట్ విమానంతో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నాయి. తరువాత రష్యన్ నావికాదళం పైలట్ల కోసం అన్వేషణ, వారి రక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో సముద్ర ఉపరితలంపై ఫైటర్ జెట్ శిథిలాలు కనిపించాయి. కానీ ఇప్పటివరకు ఇద్దరు పైలట్ల జాడ మాత్రం దొరకలేదు.
Su-30SM, NATO కోడ్‌నేమ్ “ఫ్లాంకర్-H” తో పిలువబడేది. ఇది రష్యా ఇర్కుట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన 4+ తరం బహుళ యుద్ధ విమానం. ఈ ఫైటర్ జెట్‌లో థ్రస్ట్-వెక్టరింగ్ ఇంజిన్లు, దశలవారీ రాడార్, అధునాతన ఏవియానిక్స్‌తో రూపుద్దిదుకుంది. ఇది గాలి, భూమిపై రెండింటిలోనూ ఒకేసారి మిషన్లను నిర్వహించగలదు. రష్యా నల్ల సముద్రం ఫ్లీట్ నావికా విమానయాన విభాగంలో భాగం, ఆక్రమిత క్రిమియాలోని సాకి లేదా బెల్బెక్ ఎయిర్‌బేస్ నుంచి ఈ జెట్ పనిచేస్తోంది. రష్యా తన Su-30 విమానాలను కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. మే 2న నోవోరోసిస్క్ సమీపంలో నావికాదళ డ్రోన్‌తో రెండు Su-30 జెట్‌లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మే 9న కింజల్ క్షిపణులను ప్రయోగించే వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో మరో Su-30 దెబ్బతింది. ఈ సంఘటనలను బట్టి చూస్తే రష్యా వైమానిక శక్తి నిరంతరం ఎదురుదెబ్బలకు లోనవుతున్నట్లు స్పష్టమవుతోంది.
రియాజాన్‌లో పేలుడు..
రష్యాలోని రియాజాన్ ప్రాంతంలోని మందుగుండు సామగ్రి కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటన ఆదేశాధినేతను ట్రంప్ భేటికి ముందు ఒత్తిడిలోకి నెడుతుందనడంలో సందేహం లేదు. రియాజాన్ ఒకప్పుడు సోవియట్ యుగంలో “ఎలాస్టిక్” పేరుతో వాయు ఆయుధాల తయారీపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. కానీ దీనిని 2015లో దివాళా తీసినట్లు ప్రకటించారు. తరువాత దీనిని పారిశ్రామిక పేలుడు పదార్థాలను తయారు చేసే ప్రైవేట్ కంపెనీ “రజ్రియాద్” కొనుగోలు చేసింది. భద్రత బాధ్యత, నిర్వహణ కంపెనీ యజమాని ఆధ్వర్యంలో ఉందని రష్యన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈరోజు పుతిన్, ట్రంప్ సమావేశం కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వైట్ హౌస్, క్రెమ్లిన్ రెండూ ధ్రువీకరించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని అమెరికా కోరుకుంది, కానీ పుతిన్ దీనిపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. 2018 హెల్సింకి శిఖరాగ్ర సమావేశం తర్వాత ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న మొదటి అధికారిక సమావేశం ఇదే.
READ MORE: Medak: దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని 25 ఏళ్ళ కన్న కొడుకుని చంపిన తల్లి..
