Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!

Pushpa Srivani Arrest

Pushpa Srivani Arrest

Pushpa Srivani Arrested: విశాఖపట్నంలోని మారికవలసలో గిరిజన గురుకుల పాఠశాల విషయంలో వివాదం మరింత ముదురుతోంది. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మారికవలస వద్ద వైసీపీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రి బాలరాజుతో పాటు పలువురు సీనియర్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పుష్ప శ్రీవాణి పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా చీర లాగి అనుచితంగా ప్రవర్తించారు.

స్కూల్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు పాఠశాల సమీపంలో శిబిరం ఏర్పాటు చేసి నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కొనసాగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను గౌరవం లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు. విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ చేసే సమయంలో మహిళా పోలీసులు తన చీరను పట్టుకుని లాగారని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. పోలీసుల ప్రవర్తన సరికాదని, తమ హక్కులను కాలరాస్తూ ఆందోళనను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మారికవలసలోని గిరిజన గురుకుల పాఠశాలను మూసివేయడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న పాఠశాలను కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల భవిష్యత్తుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. పాఠశాల వద్ద వైసీపీ నేతల నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అయితే నేతలను అరెస్ట్ చేయడంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.