Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్

Terrorists

Terrorists

Terror Module: పంజాబ్ పోలీసులు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కుట్రను భగ్నం చేస్తూ ఓ భారీ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఐఎస్ఐ ఆదేశాలతో దేశంలో ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలతో అమృత్‌సర్ పోలీసులు ఇద్దరు వేర్వేరు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు మైనర్లు ఉండటం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. ఈ అనుమానితుల నుంచి పెట్రోల్ బాంబులు (బోటిల్ బాంబులు), పిస్టళ్లు, సజీవ తులసి గుండ్లు (కార్ట్రిడ్జ్లు), లైటర్లు, ఇతర అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెట్‌వర్క్ మూలాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు విస్తరించినట్లు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన వారిలో ఒకడు తన సహచరులతో కలిసి జంతర్ మంతర్‌ వద్దకు వెళ్లాడని, అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఉగ్ర దాడికి కుట్ర పన్నినట్లు తేలింది. వీరికి ఉత్తరప్రదేశ్ నివాసి ఒకరి ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చడానికి ఐఎస్ఐ హ్యాండ్లర్లు ప్రయత్నించినప్పటికీ, భద్రతా సంస్థల అప్రమత్తత వల్ల వారి ప్లాన్ విఫలమైంది. దాంతో వారు తిరిగి పంజాబ్ చేరుకున్నారు.

ఈ రెండు ముఠాల్లో మొదటి దానికి సంబంధించి రాజస్థాన్‌కి చెందిన సుఖ్‌మన్ సింగ్‌తో పాటు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నాలుగు బాటిల్ బాంబులు, రెండు పిస్టళ్లు, తొమ్మిది కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధంలో ఉన్న సుఖ్‌మన్, పంజాబ్‌లోని పోలీస్ భవనాలు, పోలీసుల కదలికలపై నిఘా ఉంచేందుకు రెక్కీ నిర్వహించినట్లు ఒప్పుకున్నాడు. ఇక రెండో ముఠా రైల్వే ట్రాక్‌ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ దృశ్యాలను పాకిస్థాన్‌‌లోని హ్యాండ్లర్లకు పంపుతున్నట్లు గుర్తించారు. జోడా ఫాటక్ సమీపంలో రైల్వే ట్రాక్ స్తంభానికి కెమెరా అమర్చిన ఘటనలో మోహకంపూరాకు చెందిన వంశీ కుమార్‌తో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేసి పిస్టల్, కెమెరాలు, దొంగిలించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సున్నితమైన మిలిటరీ ప్రాంతాల సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నారనే కోణంలో జీఆర్పీ కూడా వీరిని విచారిస్తోంది.

ఈ కుట్ర వెనుక ఉన్న మిగతా లింకులను దర్యాప్తు చేస్తూ పోలీసులు అనమోల్ సింగ్ అనే వ్యక్తితో పాటు, ఆయుధాల చట్టం కింద ఇదివరకే జైలులో ఉన్న సుఖ్‌దేవ్ సింగ్, హర్మాన్ సింగ్‌లను కూడా ప్రొడక్షన్ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 19 ఏళ్ల వంశీ కుమార్, 24 ఏళ్ల హర్మాన్ సింగ్ (టీ షాప్ వర్కర్), 30 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్ (డ్రైవర్), 20 ఏళ్ల అన్మోల్ సింగ్, 19 ఏళ్ల సుఖ్‌మన్ సింగ్ (ట్రాక్టర్ డ్రైవర్)లతో పాటు నలుగురు మైనర్లు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడి, చదువు మధ్యలోనే ఆపేసిన ఈ మైనర్లకు చిన్న చిన్న ఆశలు చూపి, పెట్రోల్ బాంబులు తయారు చేయడం నేర్పించి దేశవ్యతిరేక కార్యకలాపాల్లోకి దించినట్లు అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్ ప్రీత్ సింగ్ భుల్లార్ వెల్లడించారు. విదేశీ ఫండింగ్, స్థానిక సహకారం, ఆయుధాల సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి దర్యాప్తు తీవ్రతరం చేశారు.