NTV Telugu Site icon

Man kills Friend: దారుణం.. బీమా డబ్బుకు ఆశపడి స్నేహితుడిని చంపి, తానే చనిపోయానని నమ్మించి..

Insurance

Insurance

Man kills Friend: నష్టాల బారినపడిన ఒక వ్యాపారవేత్త తాను చనిపోయానని నమ్మించి బీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. రాందాస్ నగర్ ప్రాంతానికి చెందిన గురుప్రీత్ సింగ్, అతని భార్య ఖుష్‌దీప్ కౌర్‌తో పాటు మరో నలుగురు కలిసి సుఖ్‌జీత్ సింగ్‌ అనే వ్యక్తిని హత్య చేసినందుకు గానూ అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రవ్‌జోత్ కౌర్ గ్రేవాల్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్‌జీత్‌ అదృశ్యమైనట్లు అతని భార్య జీవన్‌దీప్‌ కౌర్‌ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గురుప్రీత్ అనే వ్యాపారవేత్త తన వ్యాపారంలో నష్టాలను చవిచూశాడని, అతని భార్యతో పాటు మరో నలుగురు – సుఖ్వీందర్ సింగ్ సంఘా, జస్పాల్ సింగ్, దినేష్ కుమార్, రాజేష్ కుమార్‌తో కలిసి 4 కోట్ల రూపాయల భీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి గురుప్రీత్ మరణాన్ని నకిలీ చేసి డబ్బును పొందాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Software Employee: రైలులో ఉండగా ఫోన్ ను కర్రతో కొట్టిన దుండగులు.. కిందపడి టెక్కి మృతి

అసలు జరిగిందేమిటంటే?
సైన్‌పూర్ ప్రాంతానికి చెందిన సుఖ్‌జీత్‌ను చంపాలనే ఉద్దేశంతో గురుప్రీత్‌ అతనితో స్నేహం పెంచుకున్నాడు. కొన్ని రోజుల పాటు అతనితో స్నేహంగా ఉంటున్నట్లు నటించాడు. సుఖ్‌జీత్‌కు ప్రతిరోజు మద్యం తాగించేవాడు. జూన్ 19న, గుర్‌ప్రీత్ సుఖ్‌జీత్‌కు బాగా మద్యం తాగించాడు. దీంతో అతను స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అతడిని చంపేసిన అనంతరం గురుప్రీత్ మృతుడి బట్టలు మార్చుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తించలేనంతగా ట్రక్కు కింద పడేసి తొక్కించాడని పోలీసులు తెలిపారు. గురుప్రీత్ భార్య సుఖ్‌జీత్ మృతదేహాన్ని తన భర్తదిగా గుర్తించినట్లు వారు తెలిపారు. విచారణలో, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని అతని కుటుంబం జూన్ 20న రాజ్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తేలింది.

గురుప్రీత్ గత కొన్ని రోజులుగా తన భర్తకు మద్యం కొంటున్నాడని సుఖ్‌జీత్ భార్య పోలీసులకు తెలిపింది. దీనిపై పోలీసులు విచారించగా, గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో అనుమానం వచ్చి గురుప్రీత్ కుటుంబీకులను మళ్లీ విచారించారు. గురుప్రీత్ బతికే ఉన్నాడని, రూ.4 కోట్ల విలువైన బీమా సొమ్మును క్లెయిమ్ చేసుకునేందుకు అతని భార్య, ఇతరులతో కలిసి అతని మరణాన్ని నకిలీ చేసేందుకు కుట్ర పన్నాడని అప్పుడు తేలిందని వారు తెలిపారు. దీంతో గురుప్రీత్‌, అతని భార్యతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.