Beauty Contest: సాధారణంగా అందాల పోటీల్లో గెలిచిన వారికి అందాల కిరీటం, బిరుదులు, షీల్డులు, నగదు బహుమతులు ఇస్తుంటారు. కానీ పంజాబ్‌లోని బటిండాలో అందాల పోటీ ప్రకటన చూసి అందరూ అవాక్కయ్యారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ఎన్‌ఆర్‌ఐ వరుడిని పెళ్లి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని పోస్టర్లు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్లు చక్కర్లు కొట్టాయి. తమ కుమార్తెలకు ఎన్నారై సంబంధాల కోసం చూస్తున్న తల్లిదండ్రులతో పాటు పలువురు వీటిపై ఆసక్తి వ్యక్తం చేశారు. గురువారం బటిండాలోని పలు చోట్ల గోడలపై అతికించిన పోస్టర్లు ఆన్‌లైన్‌లో వేగంగా వ్యాపించడంతో పోలీసులు ఈ విషయం తెలుసుకుని దీనిపై ఆరా తీశారు.
అక్టోబరు 23న స్థానిక హోటల్‌లో నిర్వహించనున్న అందాల పోటీలో గెలుపొందిన వారికి కెనడాలో నివసించే ఎన్నారైతో వివాహం చేసుకునే అవకాశం కల్పిస్తామని వారు ప్రచారం చేసిన ఇద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందాల పోటీపై వెలిసిన పోస్టర్లలో అసభ్యకర పదాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందుకే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే అందాల పోటీ ప్రకటన చూసిన నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఈ పోస్టర్లపై అసభ్యకరమైన మహిళా చట్టం, 1986 కింద అభియోగాలతో సహా కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోస్టర్లు వేసిన తండ్రి కొడుకులను అరెస్టు చేశారు.
Britain: బ్రిటన్ ఆర్థిక మంత్రిపై వేటు.. కొత్తగా జెరెమీ హెంట్‌కు బాధ్యతలు
పంజాబ్ సామాజిక భద్రత మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి బల్జీత్ కౌర్ ఈ ఘటనను ఖండించారు. బటిండాలో అందాల పోటీలు నిర్వహించి ఫలానా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లికి ఎంచుకునేందుకు పోస్టర్లు అతికించడం తీవ్రంగా ఖండించదగినది అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సామాజిక భద్రత, మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భటిండా డిప్యూటీ కమిషనర్‌ను ఎమ్మెల్యే కౌర్ కోరారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని చెప్పారు.