Stone Attack on YSRCP Leaders in Punganur: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బసవరాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థుల తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు అక్కడికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నామినేషన్ కేంద్రానికి వెళుతున్న మిథున్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వాహనాలు ధ్వంసమైనట్లు వైసీపీ పార్టీ నేతలు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి, వైసీపీ నేతలు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లిన అనంతరం అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. టీడీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకుని నామినేషన్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఘటనాస్థలిలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
పుంగనూరులో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ నేతలు ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్పై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఎన్నికల నిర్వహణలో భద్రతపై వైసీపీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో పారా మిలిటరీ బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేషన్లను ఆన్లైన్లో కూడా స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. తాజాగా పుంగనూరులో జరిగిన ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే మరోసారి హైకోర్టును ఆశ్రయించే యోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఎన్నికల సంఘం, పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు జిల్లాలో రాజకీయ వేడిని పెంచాయి.

