Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!

Ys Pramila Pulivendula

Ys Pramila Pulivendula

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు, రాళ్ల దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి జరిగింది. 21వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో ఆమెపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు పులివెందులలోని 11, 12వ పోలింగ్ కేంద్రాల సమీపంలో రాళ్ల దాడి జరిగింది. 1, 2వ వార్డుల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న మహిళలను అడ్డుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఓటర్ స్లిప్పులను లాక్కుంటున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. 8, 9, 10వ వార్డుల్లో కూడా ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకుంటున్నారని పలువురు నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

38వ వార్డు పరిధిలోని సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడినట్లు వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. 18వ వార్డు యర్రగుడిపల్లి వద్ద వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరగగా.. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వరుస ఘటనలతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.