Site icon NTV Telugu

PSLV C59 Launch: ‘ప్రోబా-3’ మిషన్‌ విజయవంతమైంది: ఇస్రో ఛైర్మన్

Proba 3

Proba 3

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 వాహక నౌక నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహక నౌక కక్ష్యలోకి ప్రవేశించింది. సాంకేతిక లోపం కారణంగా బుధవారం చేపట్టాల్సిన ప్రయోగం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. ప్రయోగం విజయవంతంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

‘రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అనుకున్న కక్షలోకి ప్రోబా-3 ఉపగ్రహాన్ని చేర్చింది. ఈ విజయం ఇస్రో కుటుంబ సభ్యులందరిదీ. పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్‌ను త్వరలోనే ప్రయోగిస్తాం. సూర్యుడిపై మరిన్ని పరిశోధనలు చేస్తాం. ఎన్ఎస్‌ఐఎల్‌ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టాం. పీఎస్‌ఎల్‌వీకి మరిన్ని అవకాశాలు కల్పించిన ఎన్‌ఎస్‌ఐఎల్‌కు ధన్యవాదాలు. డిసెంబరులో స్పేటెక్స్‌ పేరుతో పీఎస్‌ఎల్‌వీ-సీ60 ప్రయోగం ఉంటుంది. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్‌-1 సోలార్‌ మిషన్‌ కొనసాగుతుంది’ అని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ చెప్పారు.

ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కేజీలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి అని ఈఎస్‌ఏ పేర్కొంది.

 

Exit mobile version