పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్ వాయిదా పడింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పీఎస్ఎల్ 2025ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం (మే 7) నుంచి పీఎస్ఎల్ మ్యాచ్ జరగలేదు. గురువారం రావల్పిండిలో కరాచీ కింగ్స్, పెషావర్ జల్మీ మధ్య మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. రావల్పిండి స్టేడియంకు సమీపంలో భారత్ దాడులు జరపడంతో ఈ మ్యాచ్ రద్దు అయింది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీఎస్ఎల్ 2025లోని మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చాలని పీసీబీ నిర్ణయించింది. రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సిన చివరి ఎనిమిది మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తామని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. చివరకు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.
Also Read: Pawan Kalyan: పదవి ఉన్నంతకాలం.. నా జీతం మొత్తం మీకోసమే!
మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కూడా ఒక వారం పాటు వాయిదా పడింది. ఓవైపు భారతదేశం యుద్ధం చేస్తుంటే.. క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సరైంది కాదనిపించిందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడకూడదని టోర్నీని వాయిదా వేశారు. ఐపీఎల్ 2025లో ఇంకా 12 లీగ్ మ్యాచులు ఉన్నాయి. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో ఫైనల్ ఉంది.
