Site icon NTV Telugu

The Kerala Story: ఆ ఆరోపణలు నిరూపిస్తే కోటి బహుమతి.. ముస్లిం యూత్ లీగ్ ప్రకటన

Kerala Story

Kerala Story

The Kerala Story: మే 5న విడుదలవుతున్న ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీపీఐ(ఎం), కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు ఈ చిత్రాన్ని “ప్రచార చిత్రం” అని తీవ్రంగా విమర్శించారు.సోమవారం ‘ది కేరళ స్టోరీ’ మద్దతుదారులకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యువజన విభాగం అయిన ముస్లిం యూత్ లీగ్ ఒక సవాల్‌ను విసిరింది. ‘లవ్ జిహాద్’ ద్వారా 32 వేల మంది బాలికలను ఇస్లాంలోకి మార్చి సిరియాకు తరలించారని సినిమాలో వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే కోటి రూపాయల బహుమతి ఇస్తామని యూత్ లీగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే ఫిరోస్ ప్రకటించారు. ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే ముస్లిం యూత్ లీగ్ జిల్లా కేంద్రాల్లోని కౌంటర్‌లో సమర్పించి రివార్డు సొమ్మును పొందవచ్చని పీకే ఫిరోస్ తెలిపారు. “సంఘ్ పరివార్ ప్రాయోజిత చిత్రమని తమ వద్ద ప్రామాణికమైన గణాంకాలు ఉన్నాయని, 32,000 మంది బాలికలను ఈ విధంగా సిరియాకు తీసుకెళ్లారని చెప్పినప్పుడు, కేరళలోని ప్రతి పంచాయతీ నుంచి కనీసం 30 మంది ఉండాలి. కానీ మేము అడిగినప్పుడు సమాధానం లేదు.” అని పీకే ఫిరోస్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ‘ది కేరళ స్టోరీ’ చిత్రం “విద్వేషాన్ని వ్యాప్తి చేయడం” లక్ష్యంగా రూపొందించబడిందని విమర్శించారు. ఈ చిత్రం సంఘ్ పరివార్ “అబద్ధాల ఫ్యాక్టరీ” ఉత్పత్తి అని, సంఘ్ పరివార్ తమ “ద్వేషపూరిత ప్రచారం” ద్వారా కేరళ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన అన్నారు. వివిధ దర్యాప్తు సంస్థలు, కోర్టులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా కొట్టివేసిన లవ్ జిహాద్ ఆరోపణల నేపథ్యంలో సినిమా తీయడం కూడా ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమేనని సీఎం అన్నారు. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ చిత్రానికి సుదీప్తో సేన్ రచన, దర్శకత్వం వహించింది. మే 5న థియేటర్లలో విడుదల కానుంది. దీనిని సూర్యపాల్ సింగ్, విపుల్ అమృతలాల్ షా సహ రచయితలుగా ఉన్నారు.

Read Also: Brij Bhushan Issue: బ్రిజ్‌భూషణ్ వివాదం.. సాక్షితో ఫోటో వైరల్.. చిన్మయి స్ట్రాంగ్ కైంటర్

రాష్ట్రానికి చెందిన 32,000 మంది బాలికలు తప్పిపోయారని, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని సినిమా ట్రైలర్‌లో పేర్కొనడంతో అదా శర్మ నటించిన కేరళ స్టోరీ వివాదాలకు కేంద్ర బిందువైంది. మే 5న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ నుండి చాలా ఎదురుదెబ్బలను ఎదుర్కొంది, రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను నిషేధించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ వివాదంలో దర్శకుడు, నిర్మాత, నటుడు సినిమాకు మద్దతు ఇచ్చారు. కేరళ కథ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటుంది, ముస్లింలను కాదు.. మొత్తం చిత్రంలో రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏమీ లేదన్నారు.

Exit mobile version