Site icon NTV Telugu

Priyanka Gandhi: ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రియాంక గాంధీ ప్రసంగం.. అభినందించడంలో పోటీపడ్డ సభ్యులు!

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi’s speech on Operation Sindoor: లోక్‌సభలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్‌ లేదా ఇంకెవరన్నా రాజీనామా చేశారా? అని అడిగారు. టీఆర్‌ఎఫ్‌ కొత్త సంస్థ ఏం కాదు అని, వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? అని మండిపడ్డారు. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు తమ కుటుంబం గురించే మాట్లాడతారని, మీరు బాధ్యతతో ఎప్పుడైనా వ్యవహరించారా? అంటూ బీజేపీ నాయకులను ప్రియాంక గాంధీ నిలదీశారు. లోక్‌సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రసంగం అనంతరం ఇండియా కూటమి సభ్యులు ఆమెను అభినందించడంలో పోటీపడ్డారు.

‘ప్రభుత్వం గతం గురించి మాట్లాడుతోంది, నేను వర్తమానం గురించి మాట్లాడుతున్నా. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల వ్యధను పూర్తిగా అర్దం చేసుకునే మాట్లాడుతున్నా. పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యత వహించి హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేశారా? చేయలేదే. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు మా కుటుంబం గురించే మాట్లాడతారు. మీరు బాధ్యతతో ఎప్పుడైనా వ్యవహరించారా?. ఆపరేషన్ సిందూర్‌ను ప్రతి రాజకీయ పక్షం సమర్ధించింది. అయితే శ్రమ పడింది సైనికులైతే, కీర్తిని సొంతం చేసుకుంది ప్రధాని మోడీ. కీర్తిని సొంతం చేసుకున్నారు, పర్లాలేదు.. మరి బాధ్యత కూడా తీసుకోవాలి కదా. పహల్గాం ఉగ్రదాడిని పసిగట్టలేక లేకపోయారు, ఇది నిఘావర్గాల వైఫల్యం కాదా?’ అని ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

‘ప్రతిరోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పర్యాటకులు పహల్గాం వస్తున్నప్పుడు ఒక్క సైనికుడైనా రక్షణ కోసం అక్కడ ఉన్నారా?. పర్యాటకులకు సాయుధ బలగాలు రక్షణ కల్పించారా?. ఇది వైఫల్యం కాదా?. బాధ్యత ఎవరు వహించాలి. దేశ ప్రధానిది బాధ్యత కాదా?, హోమ్ మంత్రికి బాధ్యత లేదా?’ అని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లు ప్రియాంక గాంధీ సభాముఖంగా చదివారు. మృతి చెందిన ప్రతి వ్యక్తి పేరు చదవుతుంటే.. హిందూ అంటూ అధికార పక్ష సభ్యులు, భారతీయులు అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరవీరులుగా ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ప్రసంగం పూర్తవగానే ఇండియా కూటమి పక్షాల సభ్యులు ప్రియాంక గాంధీ వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు.

Exit mobile version