తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ప్రియాంక గాంధీ. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోఆమె మాట్లాడుతూ.. రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదన్నారు. తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియాకు తెలుసు అని, అయినా.. రాజకీయ లబ్దికోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారని ప్రియాంక వెల్లడించారు. శ్రీకాంతాచారికి నా నివాళి అని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారని, మీ కలలు సాకారం అవుతాయని బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓటేశారని కానీ నిజం కాలేదన్నారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్ మారుతుందని అనుకున్నారని, మీ కలను కాంగ్రెస్ అర్థం చేసుకుందన్నారు. సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతమన్నారు.
అంతేకాకుండా.. ‘మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే తెలంగాణను ఏర్పాటు చేశాం. సోనియాగాంధీ దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారు. కాంగ్రెస్ హాయాంలోనే ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థలు వచ్చాయి. మీ కోసం 6 గ్యారంటీలతో వస్తున్నాం. గ్యారంటీలు ఇస్తామన్న రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం. మీ పిల్లల భవిష్యత్ కోసం మీరు కష్టపడుతున్నారు. బీఆర్‌ఎస్ ఇంటికో ఉద్యోగం ఇస్తామంది. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, బీఆర్‌ఎస్ భర్తీ చేయలేదు. మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అవమానించారు. ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరుగుతోంది. తెలంగాణ అమరవీరులను గౌరవిస్తాం. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. బీఆర్‌ఎస్ నేతలు తమకు కావాల్సిన వాళ్లకు భూములను ఇచ్చేశారు. 27 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.’ అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.