Site icon NTV Telugu

PM Modi: రేపు మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

Mangalagiri Aiims

Mangalagiri Aiims

PM Modi: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్‌ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 9 క్రిటికల్‌ కేర్‌ యూనిట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరితో పాటు రాజ్‌కోట్‌, భటిండా, రాయ్‌బరేలి, కల్యాణి ఎయిమ్స్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, భారతీ పవార్‌లు హాజరుకానున్నారు. అలాగే విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు నాలుగు మొబైల్ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

Read Also: Lara Thermal Plant: నేడు లారా థర్మల్‌ ప్లాంట్‌ జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ..

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్‌ నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. అప్పటి టీడీపీ సర్కారు మంగళగిరి సమీపంలో 183 ఎకరాలు కేటాయించింది. రూ.1618 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కేంద్రమే ఎయిమ్స్ నిర్మించింది. ఇక్కడ వైద్యకళాశాల, మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కళాశాల, ఆపరేషన్ థియేటర్లతోపాటు, ఇన్ పేషెంట్, అత్యవసర సేవలు, రెసిడెన్సియల్ బ్లాక్, గెస్ట్ హౌస్ , అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ తోపాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. 2019 మార్చి నుంచే రోగులకు సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండున్నర వేలమంది రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే 15 లక్షల మందికి ఓపీ సేవలు అందగా.. మరో 20 వేల మంది ఇన్‌పేషెంట్‌గా జాయిన్ అయి చికిత్సలు పొందారు. మరో 12 వేల మందికి అత్యవసర చికిత్సలు అందించారు.

Exit mobile version