Mission Life: వాతావరణ మార్పులపై పోరాటంలో అత్యంత ముఖ్యమైన అంశం ఐక్యత అని గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో గురువారం జరిగిన ‘మిషన్ లైఫ్’ గ్లోబల్ లాంచ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో కలిసి గురువారం ఏక్తా నగర్‌లో ‘మిషన్ లైఫ్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. “వాతావరణ మార్పుల విషయం అన్ని చోట్లా కనిపిస్తోంది, మన హిమానీనదాలు కరిగిపోతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుంది. జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటం ఐక్యత తప్ప మరొకటి కాదు.” అని ప్రధాని అన్నారు. P3 (ప్రో-ప్లానెట్ పీపుల్) భావనను మిషన్ లైఫ్ బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
వాతావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని.. అందులో ప్రజలు కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ సూచించారు. జీవనశైలిని పర్యావరణ హితంగా మార్చుకుంటే భూమి రక్షణకు ఎంతో సాయం చేసిన వారవుతారని మోడీ సూచించారు. మిషన్ లైఫ్ కార్యాచరణ ప్రణాళిక, మిషన్ లైఫ్ లోగో, ట్యాగ్ లైన్‌లను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ నినాదాన్ని మిషన్ లైఫ్ మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ వాతావరణ మార్పు అనేది విధానపరమైన సమస్య అనే అపోహ ఉందని.. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు దీనిపై చర్యలు తీసుకుంటాయనే అభిప్రాయం ఉందన్నారు. కానీ ప్రజలు దాని ప్రభావాన్ని అనుభవిస్తున్నారన్నారు. కొందరు ఏసీని 17లో పెట్టుకుంటారని.. ఇది వాతావరణంపై దుష్ప్రభావాన్ని చూపుతోందని ప్రధాని మోడీ అన్నారు. జిమ్‌కి వెళ్లేప్పుడు సైకిళ్లను వాడాలి సూచించారు. మనవంతుగా జీవనశైలిలో చేసుకునే మార్పులు.. పర్యావరణానికి మేలు చేస్తాయన్నారు. ఈ వాతావరణ మార్పు అన్ని చోట్లా మనకు కనిపిస్తోందని మోడీ వెల్లడించారు.
Corona: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్.. యమా డేంజరట!
భారత్ ఆర్థిక, సాంకేతిక సహకారంతో వాతావరణ మార్పులపై యుద్ధం చేస్తామని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ప్రపంచంలో 80 శాతం గ్రీన్‌హౌస్ గ్యాస్‌ను జీ20 దేశాలే విడుదల చేస్తున్నాయని ఆయన అన్నారు. మరోపక్క ఆ దేశాలే ప్రపంచ జీడీపీలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయన్నారు. కర్బన ఉద్గారాల విడుదలపై చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మిషన్ లైఫ్ ప్రారంభంపై ప్రపంచ దేశాలు భారత్‌ను కొనియాడాయి. ‘డియర్ ప్రైమ్ మినిస్టర్, డియర్ నరేంద్ర, ఇతర సిబ్బంది, స్నేహితులకు నమస్తే. ఈ ప్రత్యేక సమయంలో నేను మీ వద్ద ఉండాలనుకున్నాను. భారత్ ప్రారంభించిన ఈ మిషన్ విజయం సాధించేలా ఫ్రాన్స్ కూడా కలిసి పనిచేయాలనుకుంటోంది’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మెసేజ్ పంపారు. మడగాస్కర్, జార్జియా, బ్రిటన్ వంటి పలు దేశాలు ఈ ప్రయత్నాన్ని ప్రశంసించాయి. ,బ్రిటన్, మాల్దీవులు సహా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు.. భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇంధన స్వాతంత్ర్యం ఆర్థిక వ్యవస్థలను రక్షించడానికి భారత్‌తో కలిసి పని చేస్తామని బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.. తెలిపారు.