NTV Telugu Site icon

Lok sabha: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ లాస్ట్ స్పీచ్

Rajsabha Pm Modi

Rajsabha Pm Modi

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లోక్‌సభలో (Lok sabha) ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మోడీ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలకు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయారంటూ ఎద్దేవా చేశారు.

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగబోతున్నట్లు వెల్లడించారు. మా పాలనను వెయ్యేండ్ల పాటు ప్రజలు గుర్తించుకునేలా వచ్చేసారి పరిపాలిస్తామని పేర్కొన్నారు. మూడోసారి బీజేపీకి 370 సీట్లు ఖాయమని.. ఎన్డీఏ కూటమికి మొత్తం 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించడమే విపక్షాలకు తెలుసు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని.. అందుకే చాలా మంది రాజ్యసభకు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ బుద్ధి మారలేదు.. జాలేస్తోంది
పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు (Congress) మారలేదు అన్నారు. కుటుంబ పాలనతో దేశం ఎంతో నష్టపోయిందని.. కాంగ్రెస్‌ నాయకులు కూడా అంతే నష్టపోయారన్నారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారని.. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరని. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్‌ చేస్తోందని తెలిపారు. తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదన్నారు. ఇండియా కూటమి కుదుపులకు లోనైందని చెప్పారు. విపక్షాల సంకల్పానికి తాను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్‌కు మోడీ చురకలంటించారు.

నెక్ట్స్ టార్గెట్ ఇదే..
పదేళ్ల క్రితం ప్రపంచంలోని 11వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉందని… ఇప్పుడు ఐదో స్థానంలో ఉందన్నారు. ఎవరేం అనుకున్నా హ్యాట్రిక్‌ విజయం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. మూడో టెర్మ్‌లో మాత్రం దేశం మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.