NTV Telugu Site icon

Narendra Modi : తెలుగు ప్రజలకు ప్రధాని వినాయక నవరాత్రుల కానుక

Pm Modi

Pm Modi

తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాయక నవరాత్రులకు కానుకను అందించనున్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రైలు కనెక్టివిటీని మరింత పెంచేందుకు తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది. అదే సమయంలో విశాఖపట్టణం, దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య మరో వందేభారత్ రైలు సేవలందించనుంది. ఈ రెండు రైళ్లను సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఆ రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 10 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు.

Read Also : Kolkata Doctor Case: వైద్యురాలికి న్యాయం చేయాలి.. జోక్యం కోరుతూ రాష్ట్రపతి, ప్రధానికి ఆర్‌జీ కర్ వైద్యుల లేఖ..

సామాన్యులు వందే భారత్ రైళ్లపై మక్కువ చూపుతుండటం, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండటం కారణంగా.. కేంద్రప్రభుత్వం ఈ రైళ్లతో వీలైనన్ని ప్రాంతాలను అనుసంధానించేందుకు కృషిచేస్తోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ రైలు.. నాగ్‌పూర్ నుండి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. 578 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7.15 గంటల్లో పూర్తి చేయనుంది. ఈ రైలు కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్ , సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగనుంది.

Read Also : Brewing of Beer: బీర్ ప్రియులూ ఇది విన్నారా?.. మూత్రంతో బీర్ల తయారీ.. ఎక్కడంటే?

నాగ్‌పూర్ నుంచి మొదలయ్యే రైలు.. సికింద్రాబాద్ చేరుకునే సందర్భంలో స్వాగతం పలకాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పంపించారు. ఇందులో.. తెలంగాణలో రూ. 32,946 కోట్లతో రైల్వే సేవల అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.5,336 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలోని 40 స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం, విశాఖపట్టణం నుంచి ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ ప్రాంతానికి వెళ్లనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రాయ్‌పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతబంజి, తిత్లాగఢ్, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకోనుంది. ఈ సర్వీస్ మూడు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా) ప్రయాణికులకు సేవలందిస్తోంది.