NTV Telugu Site icon

President Droupadi Murmu: రేపు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu

Droupadi Murmu

President Droupadi Murmu: హైదరాబాద్‌లో జరుగుతున్న ‘భక్తి టీవీ’ కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. కోటి దీపోత్సవ వేడుకలో రాష్ట్రపతి దీప ప్రజ్వలన చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక సందర్భంగా కోటి దీపోత్సవంలో పూరి జగన్నాథుని పూజా కార్యక్రమంతో పాటు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం జరగబోతోంది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు. ఈ సారి భక్తి టీవీ కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు.

14 ఏళ్లుగా ప్రతీ ఏడాది కార్తీక మాసంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగే కోటి దీపోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నారు. ప్రతి రోజూ దేశంలోని వివిధ ఆలయాల నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి కల్యాణాలు జరపించడంతో పాటు ఒకేసారి వేలాది మంది లక్షల దీపాలను వెలిగించడం ద్వారా కోటి దీపోత్సవం ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోని సుప్రసిద్ధ పీఠాల అధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు కోటి దీపోత్సవ వేడుకలకు హాజరవుతారు. శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రవిశంకర్, చినజీయర్ స్వామి, జగద్గురు కంచికామకోటి పీఠాధిపతి, పూరి పీఠాధిపతి, బాబా రామ్‌దేవ్, గణపతి సచ్చిదానందతో పాటు పలువురు పీఠాధిపతులు గడిచిన 14 ఏళ్లుగా కోటి దీపోత్సవ వేదికపై ప్రజలకు భక్తి సందేశాలిచ్చారు. ఈ ఏడాది కూడా పీఠాల అధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి హాజరయ్యారు. చలిని కూడా లెక్కచేయకుండా వేల మంది ప్రజలు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోటి దీపోత్సవాన్ని వీక్షిస్తున్నారు.

 

 

 

Show comments