NTV Telugu Site icon

Budget Sessions 2024: పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది: ద్రౌపది ముర్ము

Droupadi Murmu

Droupadi Murmu

President Droupadi Murmu Speech in Budget Session 2024: కొత్త పార్లమెంట్‌ భవనంలో ఇదే తన తొలి ప్రసంగం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందన్నారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైనదని కొనియాడారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలిదేశంగా భారత్‌ రికార్డు సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 2024 పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. కొత్త పార్లమెంట్‌లో తొలిసారిగా బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి.

పార్లమెంట్‌ బడ్జెట్‌ 2024 సమావేశాల సందర్భంగా నూతన భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ‘కొత్త పార్లమెంట్‌లో ఇదే నా తొలి ప్రసంగం. భారత సంస్కృతి, సభ్యత ఎంతో చైతన్యవంతమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 ప్రవేశించింది. జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది’ అని రాష్ట్రపతి అన్నారు.

‘శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. భగవాన్‌ బిర్సా ముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా నిర్వహించుకుంటున్నాం. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం. ఆ సియా క్రీడల్లో భారత్‌ తొలిసారి 107 పతకాలు, పారా క్రీడల్లో 111 పతకాలు సాధించింది. తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా నారీశక్తి వందన్ అధినియమ్‌ బిల్లును ఆమోదించుకున్నాం. శతాబ్దాలుగా కలలు కంటున్న రామమందిర నిర్మాణం అయోధ్యలో సాకారమైంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి రాముడి ఆలయాన్ని ప్రారంభించాం’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.

Also Read: Mayank Agarwal: విమానంలో తీవ్ర అస్వస్థత.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మయాంక్ అగర్వాల్!

‘దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది. రీఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. కొత్త క్రిమినల్‌ చట్టాలను తీసుకొచ్చాం. ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ నినాదంతో ముందుకెళ్తున్నాం. రక్షణ, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. చిన్నతనం నుంచి మనం ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం. కానీ తొలిసారి పేదరికాన్ని పెద్ద ఎత్తున పారదోలడం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోంది. ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాం. తెలంగాణలో సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మించుకున్నాం. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ ఎత్తివేయడం చారిత్రక నిర్ణయం. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ మన నినాదం’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.