Former India Pacer Praveen Kumar Survive Car Crash In Meerut: టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. భారీ లోడ్‌తో వస్తున్న ఓ ట్రక్కు.. మూల మలుపు వద్ద ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కారు డామేజ్ అయింది. కారులో ఉన్న ప్రవీణ్ కుమార్, అతడి కొడుకుకు స్వల్ప గాయాలు కాగా.. స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. మీరట్ వద్ద ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రికెట్ నుంచి తప్పుకున్నాక మీరట్‌లో నివసిస్తున్న ప్రవీణ్ కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఓ రెస్టారెంట్‌ను కూడా నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి తన మేనల్లుడిని దించేందుకు కొడుకుతో పాటు వెళ్లాడు. తిరిగి వస్తుండగా మీరట్ సమీపంలో ఓ మూల మలుపు వద్ద ఒక భారీ ట్రక్ కారును వెనుక నుండి ఢీ కొట్టింది. కారు పెద్దది (ల్యాండ్ రోవర్ డిఫెండర్) కావడంతో వారికి ఎటువంటి గాయాలు కాలేదు. స్వల్ప గాయాలు అయిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారని మీరట్ పోలీసులు తెలిపారు.
Also Read: Nabha Natesh Latest Pics: నభా నటేష్ అందాల విందు.. ‘ఇస్మార్ట్’ పోరి గ్లామర్‌కు కుర్రాళ్లు ఫిదా!
‘దేవుడి దయ వల్ల మేము బయటపడ్డాం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. లేదంటే ఈ ప్రమాదం చాలా దారుణంగా ఉండేది. నేను మా మేనల్లుడుని డ్రాప్ చేయడానికి వెళ్లాను. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఒక భారీ ట్రక్ నా కారును వెనుక నుండి ఢీ కొట్టింది. పెద్ద కారు కాబట్టి బతికిపోయాం. లేకపోతే గాయాలు తీవ్రంగా అయ్యి ఉండేవి. దేవునికి ధన్యవాదాలు. కేవలం బంపర్ మాత్రమే విరిగిపోయిందనుకున్నా.. కానీ కారు బాగా దెబ్బతింది’ అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 30న కీపర్ రిషబ్ పంత్ కూడా కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ భారత్ తరపున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులలో 27 వికెట్లు, వన్డేలలో 77 వికెట్లు, టీ20లలో 8 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లు కలిపి 112 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టులో 2007 నుంచి 2012 వరకు కొనసాగాడు. ఆస్ట్రేలియా గడ్డపై సీబీ సిరీస్ గెలవడంతో ప్రవీణ్ కీలక పాత్ర పోషించాడు. ఓవైపు ఫామ్ కోల్పోవడం, గాయాల పాలవడం.. మరోవైపు జట్టులోకి మొహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి వంటి బౌలర్లు రావడంతో ప్రవీణ్ జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. 119 మ్యాచులు ఆడిన ప్రవీణ్.. 90 వికెట్లు తీశాడు.
Also Read: Nikhil Siddhartha Apologies: మాట నిలబెట్టుకోలేకపోయా.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్!
