సినీ పరిశ్రమలో నటులకు కోట్లాది రూపాయల పారితోషికాలు, లగ్జరీ కార్లు, సమాజంలో గౌరవం లభిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం సగటు ప్రేక్షకులు. అభిమానులు తమ కష్టార్జితాన్ని వెచ్చించి థియేటర్లకు వస్తేనే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. కానీ, తాజాగా సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపుపై స్పందిస్తూ.. ‘సినిమాలు చూడకండి, ఎవడి వ్యాపారం వాడిది’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : Peddi: ‘పెద్ది’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !
కోవిడ్ తర్వాత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమను ప్రేక్షకులు మళ్ళీ ఆదరించి నిలబెట్టారు. అలాంటి ఆడియన్స్ టికెట్ రేట్ల భారం గురించి అడిగితే, కనీసం సానుభూతి లేకుండా ‘చూడటం మానేయండి’ అని అనడం అహంకారమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రేక్షకులు లేకపోతే స్టార్స్ లేరని, సినిమా అనే ఇండస్ట్రీయే ఉండదనే కనీస లాజిక్‌ను ప్రకాష్ రాజ్ ఎలా మర్చిపోయారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇలాగే మాట్లాడిన దర్శకుడు ఆర్జీవీ పరిస్థితి ఏమైందో ఒకసారి గుర్తు చేసుకోవాలని సినీ అభిమానులు చురకలు వేస్తున్నారు. ఒక నటుడిగా ఇంతటి ఫేమ్ సంపాదించిన ప్రకాష్ రాజ్, తనని ఈ స్థాయికి చేర్చిన ప్రేక్షకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
