Prajwal Revanna: రేప్ కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న ఆయన వద్ద ఇటీవల ఓ మొబైల్ ఫోన్ లభించగా, దాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపిన అధికారులకు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఫోన్‌లో ఏకంగా పదుల సంఖ్యలో పోర్నోగ్రఫీ (అశ్లీల) వీడియోలు ఉన్నట్లు తేలడం గమనార్హం. గత ఆగస్టు 11వ తేదీన పరప్పన అగ్రహార జైలులోని హై-సెక్యూరిటీ బ్యారక్‌లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. శోధన సమయంలో రేవణ్ణ వద్ద ఒక మొబైల్ ఫోన్‌తో పాటు ఛార్జర్, పెన్ డ్రైవ్, ఒక నోట్‌బుక్ లభించాయి. సాధారణంగా జైళ్లలోకి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లడం పూర్తిగా నిషిద్ధం. ఖైదీలు ఎవరైనా బయటి వారితో మాట్లాడాలనుకుంటే కేవలం నిఘా ఉండే జైలు ల్యాండ్‌లైన్లు, పబ్లిక్ కాల్ ఆఫీసులు లేదా ప్రభుత్వం కేటాయించిన వీడియో కాలింగ్ వ్యవస్థల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి అనుమతి ఉంటుంది.
అలాంటిది నిబంధనలను అతిక్రమించి ఆయన వద్ద లభించిన ఈ ఫోన్, పెన్ డ్రైవ్‌లను అధికారులు వెంటనే ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదికల్లో ఫోన్‌లో పెద్ద ఎత్తున నిషిద్ధ అశ్లీల వీడియోలు నిల్వ ఉన్నట్లు తేలగా, పెన్ డ్రైవ్‌లో కొన్ని వెబ్ సిరీస్‌ల కంటెంట్ ఉన్నట్లు వెల్లడైంది. అత్యంత రక్షణ ఉండే పరప్పన అగ్రహార జైలులోకి ఈ పరికరాలు ఎలా వచ్చాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఘటనతో విఐపి ఖైదీలకు జైలులో ప్రత్యేక మర్యాదలు, అక్రమ సదుపాయాలు అందుతున్నాయనే ఆరోపణలకు మళ్లీ బలం చేకూరింది.
ఇక, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మనవడు, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి మేనల్లుడైన ప్రజ్వల్ రేవణ్ణ, ఒక 48 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఆ దారుణానికి సంబంధించిన వీడియోలను సర్క్యులేట్ చేసిన కేసులో గతేడాది దోషిగా తేలారు. కర్ణాటకలోని హాసన్ జిల్లా హోలేనరసిపురలో ఉన్న రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఆ బాధితురాలు గృహ కార్మికురాలిగా పనిచేసేది. 2021 నుంచి రేవణ్ణ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి, ఆ దృశ్యాలను రికార్డు చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే ఆ రికార్డింగ్‌లను బయటపెడతానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. అటువంటి తీవ్రమైన నేరం కింద శిక్ష అనుభవిస్తున్న రేవణ్ణ వద్ద ఫోన్ దొరకడం తీవ్ర దుమారం రేపడంతో జైలు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ నిషేధిత పరికరం జైలు లోపలికి ఎలా వచ్చిందనే దానిపై సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక జైలు అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశారు.

