Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వే చెస్ టోర్నమెంట్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించి వరుసగా మూడో క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు. ఒస్లోలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో తొమ్మిదో రౌండ్ లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను మట్టికరిపించాడు.
ఇటీవల ప్రపంచ నంబర్ వన్, టోర్నమెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (Magnus Carlsen) పై ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. అంతకుముందు అలిరెజా ఫిరౌజాపై కూడా గెలిచిన అతడు, ఇప్పుడు గుకేశ్‌ను ఓడించి హ్యాట్రిక్ క్లాసికల్ విజయాలు నమోదు చేశాడు. ముఖ్యంగా ఐదో రౌండ్‌లో గుకేశ్ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్రజ్ఞానంద.. తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. గుకేశ్ సాధారణంగా వినూత్న ఎత్తుగడలతో ప్రత్యర్థులను ఒత్తిడికి గురిచేస్తాడని, అలాంటి పరిస్థితుల్లో తాను గతంలో చాలాసార్లు ఓడిపోయానని చెప్పాడు. అయితే ఈసారి సమయాన్ని సరిగ్గా వినియోగించడంతో పాటు లెక్కల్లోనూ తప్పులు చేయకుండా మంచి ఆటను ఆడానని పేర్కొన్నాడు.
అట్టడుగు స్థానం నుంచి టైటిల్ రేసులోకి:
కొద్ది రోజుల క్రితం వరకు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ప్రజ్ఞానంద ఇప్పుడు టైటిల్ పోరులో నిలవడం విశేషం. వెస్లీ సో చేతిలో ఓటమి తర్వాత వరుసగా మూడు విజయాలు సాధించి పుంజుకున్నాడు. ప్రస్తుతం టోర్నమెంట్‌లో నాలుగు విజయాలు నమోదు చేసిన ప్రజ్ఞానంద, అగ్రస్థానంలో ఉన్న వెస్లీ సోకు కేవలం అర పాయింట్ దూరంలోనే ఉన్నాడు. ఈ టోర్నమెంట్‌లో తన ఆటపై నమ్మకం ఎప్పటినుంచో ఉందని ప్రజ్ఞానంద తెలిపాడు. అయితే కొన్ని మ్యాచ్‌ల్లో సమయాభావం కారణంగా గెలుపును చేజార్చుకున్నానని పేర్కొన్నాడు. ముఖ్యంగా గుకేశ్‌తో తెలుపు పావులతో ఆడిన మ్యాచ్‌లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. టైమ్ ట్రబుల్ కారణంగా విజయం దక్కలేదని గుర్తుచేశాడు. గత మూడు గేమ్‌ల్లో మాత్రం సమయాన్ని జాగ్రత్తగా వినియోగించడం తనకు కలిసొచ్చిందని వివరించాడు.
టోర్నమెంట్ ప్రారంభంలో చివరి స్థానంలో ఉన్నప్పుడు వరుసగా మూడు విజయాలు సాధిస్తానని తాను కూడా ఊహించలేదని ప్రజ్ఞానంద అన్నాడు. అయితే ప్రతి మ్యాచ్‌ను ఒక సవాల్‌గా తీసుకుని పోరాడటమే తన లక్ష్యమని చెప్పాడు. ఇక్కడ ఒక్క గేమ్ గెలవడమే చాలా కష్టమని, ముందుగానే లెక్కలు వేసుకోవడం కంటే ప్రస్తుత మ్యాచ్‌పై దృష్టి పెట్టడం ముఖ్యమని అన్నాడు.
మరోవైపు మహిళల విభాగంలో కజకిస్థాన్‌కు చెందిన బిబిసారా అస్సౌబయేవా చివరి రౌండ్‌కు ముందే టైటిల్‌ను ఖాయం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన అనుభవజ్ఞురాలు అన్నా ముజిచుక్‌తో డ్రా ఆడిన ఆమె 16.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. భారత గ్రాండ్‌మాస్టర్లు దివ్యా దేశ్‌ముఖ్, కోనేరు హంపి ప్రస్తుతం మహిళల విభాగంలో చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. వరుసగా రెండు క్లాసికల్ పరాజయాలు ఎదుర్కొన్న దివ్యా ర్యాంకింగ్స్‌లో మరింత వెనుకబడింది.
THREE CLASSICAL WINS IN A ROW?! 🤯
Pragg is on fire 🔥 🔥
Today, he beat the World Champion with the black pieces! #NorwayChess pic.twitter.com/CvO0zj2jE4
— Norway Chess (@NorwayChess) June 4, 2026
