NTV Telugu Site icon

Prabhala Theertham: సంక్రాంతి సంబరాలు.. నేడు కొత్తపేటలో ప్రభల తీర్థం

Prabhala Theertham

Prabhala Theertham

Prabhala Theertham: తెలుగులొగిళ్లలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా పల్లెల్లో పండగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.. ఇక, కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది ప్రభల తీర్థం. సంక్రాంతి పండుగ వేళ ప్రభల తీర్థం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలకు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది. నేడు కొత్తపేట ప్రభుత్వ హైస్కూల్లో ప్రభల తీర్థం జరగనుంది.. కొత్తపేటలోని పాత , కొత్త రామాలయ వీధుల నుండి ప్రభలను ఊరేగింపుగా తీసుకుని రానున్నారు నిర్వాహకులు.. భక్తుల దర్శనార్థం హై స్కూల్ గ్రౌండ్ లో ప్రభలు ఏర్పాటు చేస్తారు.. వేలాదిగా తరలివచ్చి ప్రభలను దర్శించుకోనున్నారు భక్తులు..

Read Also: North Korea: అమెరికా స్థావరాలే టార్గెట్.. బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన నార్త్ కొరియా

మరోవైపు.. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భారీ ఎత్తున బాణాసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.. ఆకాశం దద్దరిల్లేలా.. పోటాపోటీగా బాణాసంచా పేల్చనున్నారు.. అయితే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక, అంబాజీపేట మం­డలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. తీర్థం జరిగే ప్రాంతంలో గుడి, గోపురాలు ఉండవు. కౌశిక నదిని ఆనుకుని ఉన్న కొబ్బరి తోటలో ఈ తీర్థం జరగడం ఇక్కడి ప్రత్యేకత. కాగా, పెద్దాపురం సంస్థానాదీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు హయాంలో తొలిసారిగా 17వ శతాబ్ధంలో ఈ తీర్థాన్ని ప్రారంభించారని చెబుతుంటారు. జగ్గన్నతోటతో పాటు కొత్తపేట సెంటర్, అవిడి డ్యామ్‌ సెంటర్, కాట్రేనికోన, మామిడికుదురు మండలం కొర్లగుంట వంటి చోట్ల పెద్ద తీర్థాలు జరుగుతాయి. ఇవికాకుండా జిల్లా వ్యాప్తంగా 84 వరకూ తీర్థాలు నిర్వహిస్తారు.