NTV Telugu Site icon

Prabath Jayasuriya: 17 మ్యాచ్‌లలో 100 వికెట్స్.. చరిత్ర సృష్టించిన జయసూర్య!

Prabath Jayasuriya 100 Wickets

Prabath Jayasuriya 100 Wickets

శ్రీలంక బౌలర్‌ ప్రభాత్‌ జయసూర్య చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి వికెట్‌ తీసిన జయసూర్య.. 100 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 17 టెస్ట్ మ్యాచ్‌లలో 100 వికెట్స్ మార్క్ అందుకోవడం విశేషం. 100 టెస్టు వికెట్లు పూర్తి చేసిన నాలుగో శ్రీలంక స్పిన్నర్‌గా కూడా నిలిచాడు. జయసూర్య టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్నాడు.

టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్‌ జార్జ్ ఆల్ఫ్రెడ్ లోమన్‌ పేరిట ఉంది. 1886లో లోమన్‌ కేవలం​ 16 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మార్కును అందుకున్నాడు. కేవలం ఒక టెస్ట్ గేమ్ ద్వారా 33 ఏళ్ల ప్రభాత్‌ జయసూర్య అరుదైన రికార్డు కోల్పోయాడు. టర్నర్‌, బార్నెస్‌, గ్రిమ్మెట్‌, యాసిర్‌ షా కూడా 17 టెస్ట్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. ఇక జయసూర్య తరవాత శ్రీలంక తరఫున దిల్రువాన్ పెరీరా 25 మ్యాచ్‌లలో 100 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Keerthy Suresh Marriage: డిసెంబర్‌లోనే నా పెళ్లి: కీర్తి సురేశ్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్ అయింది. మార్కో జన్సెన్‌ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాషించాడు. కమిందు మెండిస్‌ (13), లహీరు కుమార (10 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్ అందుకున్నారు. లంక ఐదుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. అంతకుముందు ప్రొటీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. అశిత ఫెర్నాండో, లహీరు కుమార తలో 3 వికెట్లు.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్‌ జయసూర్య చెరో రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 143/3తో ఆడుతోంది.