Site icon NTV Telugu

Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం!

Potti Sriramulu Statue

Potti Sriramulu Statue

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. అలానే మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

పొట్టి శ్రీరాములు స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడకలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటయ్యే తొలి భారీ విగ్రహం ఇదే. విగ్రహానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుమును ఉపయోగించారు.

Also Read: AP 10th Class Exams 2026: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవే!

విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయానికి చేరుకోనున్నారు. అక్కడ యుద్ధ ప్రభావం, గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఆర్టీజీఎస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. సాయంత్రం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రంజాన్ నెల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విందును ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొననున్నట్లు సమాచారం.

 

Exit mobile version