NTV Telugu Site icon

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికి ఛాన్స్‌

Polling Ended

Polling Ended

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ముందు క్యూలైన్‌లో నిల్చున్న వారికి.. సమయం ముగిసినా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. అతి సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 5 గంటలకు ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది.సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం, తెలంగాణలో 61.66 శాతం పోలింగ్ నమోదైంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Also: AP Elections 2024: ఏపీలో భారీగా పోలింగ్‌.. 5 గంటలకే 70 శాతానికి చేరువగా..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది.

ఏపీలో కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. మరోవైపు.. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజక వర్గంలో కుందిర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల నేతలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో టీడీపీ అభ్యర్థికి చెందిన వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఇరువర్గాలు కొట్టుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Read Also: Lok Sabha Elections 2024: తెలంగాణలో 5 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువర్గాల చెందిన వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతల ఇళ్లపైనా రాళ్ల దాడి జరిగింది. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. అల్లరి మూకలపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయటంతో.. కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక, పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా.